శ్రీదేవి మరణంపై అనుమానాలున్నాయి : మాజీ పోలీస్ అధికారి

Friday, May 18th, 2018, 05:43:17 PM IST

దివంగత ప్రఖ్యాత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కపూర్ మరణం యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలో ముంచిన విషయం తెలిసిందే. ఆమె లేరనే వార్తను తట్టుకోలేకపోతున్నాని పలువురు ప్రముఖులు సైతం ఆమెకు కన్నీటి నివాళులు అర్పించారు. అయితే ఒక పెళ్లి వేడుక నిమిత్తం దుబాయి వెళ్లిన ఆమె దురదృష్టవశాత్తు ఆమె బసచేసిన హోటల్ గదిలోని బాత్ టబ్ లో పడి మరణించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆమె మరణం సహజమైనది కాదని, ఆమె మరణంపై ఎన్నో అనుమానాలున్నాయని, ఆమెను ఒక పథకం ప్రకారమే హత్య చేసివుంటారని ఢిల్లీ కి చెందిన మాజీ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వేదభూషణ్ ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ ని నడుపుతున్నాని, శ్రీదేవి బాత్ టబ్ లో పడి చనిపోలేదు, ఎవరో కావాలనే ఆమెను హత్య చేసారని, ఆమె మరణం వెనుక పెద్ద మిస్టరీ ఉందని ఆయన చెపుతున్నారు. నిజానికి శ్రీదేవి మరణం సమయంలో పలు కథనాలు వెలువడ్డాయి, కొందరైతే ఆమె భర్త బోనీ కపూర్ పై కూడా అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల వేద భూషణ్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ఈ మధ్య దుబాయ్ వెళ్లి శ్రీదేవి బసచేసిన హోటల్ గది దిగాలని ప్రయత్నించానని, కానీ కుదరక ఆ గదికి పక్కన వున్న గదిలో దిగానని అన్నారు. నిజానికి ఆ గది బాత్రూం సీన్ ను రీక్రియేట్ చేసి చూస్తే అసలు ఆ బాత్ టబ్ లో మునిగి ఒక వ్యక్తి చనిపోవడం అనేది జరగని పని అన్నారు. అసలు ఆ బాత్ టబ్ లో మనిషిని ముంచేసి ఊపిరాడకుండా చేసి తరువాత దానిని సులువుగా ఆత్మహత్యగా కూడా చిత్రీకరించవచ్చని చెప్పారు. ఆమె మరణంపై దుబాయ్ ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన నివేదిక పై కూడా చాలా అనుమానాలున్నాయని, వారిచ్చిన నివేదికలో చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదని అన్నారు. కాగా ప్రస్తుతం వేదభూషణ్ శ్రీదేవి మరణం పై చేస్తున్న వ్యాఖ్యలను ఆమె భర్త బోనీ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం వారు కానీ ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలి…..