నేను చాల తప్పులు చేశా… శ్రీను వైట్ల

Tuesday, November 13th, 2018, 08:10:31 PM IST

ప్రముఖ కథానాయకుడు మాస్‌ మహారాజా రవితేజ నా ట్రబుల్‌ షూటర్‌ అని ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’. రవితేజ కథానాయకుడు, ఇలియానా కథానాయిక. సునీల్‌, అభిమన్యు సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. తమన్‌ బాణీలు అందించారు. నవంబరు 16న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా శ్రీనువైట్ల మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తన సినీ కెరీర్‌ను గుర్తు చేసుకున్నారు.

‘దుబాయ్‌ శీను’ తర్వాత వరుసగా నాకు చాలా అవకాశాలొచ్చాయి. ఒకటి పూర్తవ్వగానే మరో సినిమా వచ్చేది. ఇలా తీరిక లేకుండా పోయింది. ఓ రకంగా నా ట్రబుల్‌ షూటర్‌ రవితేజనే. ‘వెంకీ’కి ముందు నేను ఫ్లాప్‌లో ఉన్నా. ఆ సమయంలో రవితేజ ఫోన్‌ చేసి ‘సినిమా చేద్దాం… రెడీగా ఉండు’ అన్నారు. ‘దుబాయ్‌ శీను’కి ముందూ అంతే. అప్పటికి ‘ఢీ’ సినిమా పూర్తవుతుందో, లేదో అనే టెన్షన్‌లో ఉన్నా. అవేవీ పట్టించుకోకుండా ‘వచ్చే నెల నుంచి మనం సినిమా తీస్తున్నాం..’ అన్నారు. ‘అదేంటి? నా దగ్గర కథ కూడా రెడీగా లేదు’ అన్నాను. ‘నువ్వు చేయగలవ్‌. ఆ నమ్మకం నాకుంది’ అంటూ ప్రోత్సహించారు. ఇప్పుడూ అంతే. ‘నా దగ్గర కథ ఉంది వింటావా’ అనగానే మరో మాటెత్తకుండా కథ విని.. సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేశారు. నాపై తనకు అంత నమ్మకం. మేమిద్దరం (రవితేజతో) కలిస్తే ‘అల్లరి’గా ఉంటుంది. దానికి బలమైన కథ జోడిస్తే ఎలా ఉంటుందో అదే ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’. ట్రైలర్‌ చూస్తే ఇది ప్రతీకార నేపథ్యంలో సాగే కథ అని అర్థం అవుతుంది. కేవలం ప్రతీకారమే కాదు.. మరో బలమైన అంశం ఈ సినిమాలో ఉంది. ఇప్పటి వరకూ ఇలాంటి నేపథ్యంలో సినిమా రాలేదని నమ్మకంగా చెబుతున్నా.