ప్రజలను నిజంగానే రెచ్చగొట్టవలసి వస్తుంది : పవన్ కళ్యాణ్

Sunday, June 3rd, 2018, 11:16:32 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టీపీడీపై మాటల దూకుడును మరింత పెంచారు. నిజానికి తాను 2014 ఎన్నికల్లో పోటీ చేసివుండవలసిందని, అనవసరంగా పోటీ నుండి తప్పుకున్నందుకుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నానని ఆయన అన్నారు. నేడు విజయనగరం జిల్లా భోగాపురం లో పర్యటిస్తున్న ఆయన అక్కడి స్థానిక ప్రజలను, ప్రజా సమస్యలను ఉద్దేశించి మాట్లాడుతూ, చంద్రబాబు ని ప్రజాసంక్షేమం పై దృష్టి పెట్టడం లేదని, వారి పార్టీ ఎమ్యెల్యేలు, మంత్రులు ప్రజా సొమ్మును దోచుకుంటున్నారు, వాటిని అరికట్టండి అని అడుగుతుంటే, తాను బిజెపి ఇస్తున్న స్క్రిప్టు చదువుతున్నానని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నానని అంటున్నారన్నారు. నిజానికి తాను గత ఎన్నికల్లో వారి పార్టీకి ఏమి ఆశించకుండా మద్దతు పలికానని, కాకపోతే ప్రజాసమస్యలను పట్టించుకోకపోవటంవల్లే తాను ప్రస్తుతం టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.

అసలు తనకు బిజెపి నేతలు స్క్రిప్టు ఇస్తే చదవాల్సిన గతి పట్టలేదని, తన పక్షం ప్రజా పక్షమని, కేవలం ప్రజలకోసమే గొంతెత్తి మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేసారు. ఇప్పటికే భోగాపురం లో ప్రజల వద్దనుండి వందల ఎకరాల్లో భూమిని ప్రభుత్వం లాక్కుందని, భూములు పక్కాగా తీసుకోవడంలో వున్న శ్రద్ధ ఇక్కడి ప్రజల బాగోగులపై లేదని అన్నారు. సింగపూర్ తరహా అభివృద్ధి ఇక్కడ చేపడతామంటున్న టిడిపి అక్కడి పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలన్నారు. సింగపూర్ కులం, మతం, జాతి, వర్గం, మనవాడు, బయటివాడు అనే తేడాలు ఉండవని, అక్కడ సమానత్వం అనేది ఉండడంవల్ల అభివృద్ధి చెందిందని అన్నారు.

ఇక్కడ మాత్రం మీరు, మీకు కావలసిన వారికీ, దగ్గరి బంధువులకు మాత్రం అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఏమైనా అంటే చేస్తున్న అభివృద్ధి పవన్ కు కనపడడంలేదా అని అంటున్నారని, నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఇప్పటికే ప్రజలు ఇటువంటి దీనావస్థలు ఎందుకుపడుతుంటారని ప్రశ్నించారు. అందుకే తనపై ఇకనైనా టీడీపీ నేతలు మాటల దాడి ఆపాలని, లేకుంటే వారు చెపుతున్నట్లు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటానని అన్నారు. కాబట్టి చంద్రబాబు గారు ఇకనైనా ప్రజల పై దృష్టి పెట్టి వారి బాధలను పట్టించుకుంటే మంచిదని హితవు పలికారు…..

  •  
  •  
  •  
  •  

Comments