ఆ స్పూర్తితో సత్యాగ్రహి తీద్దామనుకున్నాను : ఎన్నారై మీట్ లో పవన్ కళ్యాణ్

Thursday, March 15th, 2018, 04:30:07 PM IST

నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో విభజన హామీల విషయమై కేంద్ర బిజెపి ప్రభుత్వం పై, అలానే రాష్ట్ర టిడిపి ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడిన మాటల పై కొందరేమో ఆయన వెనుక ఎవరో వుంది అలా మాట్లాడిస్తున్నటు అంటే, మరికొందరేమో ఇప్పటికైనా పవన్ ప్రజల తరపునతన నిరసన గాలాన్ని తెల్పడం ఆహ్వానించదగ్గ విషయమని అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే, పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఆయన ప్రవాస తెలుగు వారితో సమావేశమయ్యారు. ఎన్నారైలను జనసేన పార్టీకి నిధుల బ్యాంక్‌గా చూడబోమని, పార్టీ నెట్‌వర్కింగ్‌లో, ఏపీ అభివృద్ధికి ఎన్నారైల సహాయం ఎంతో అవసరమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ, 1977లో విధించిన అత్యవసర పరిస్థితి నాపై చాలా ప్రభావాన్ని చూపించింది. లోక్‌ నాయక్‌ జయ ప్రకాష్‌ నారాయణ్‌ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసిన పోరాటం నాపై చాలా ప్రభావాన్ని చూపించింది. ఆ స్ఫూర్తితోనే అప్పట్లో ‘సత్యాగ్రాహి’ అనే సినిమా తీద్దామనుకున్నా. డబ్బులు పెట్టి రెండున్నర గంటలు ఆడే సినిమా తీస్తాం. మరి అది సమాజంపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అని నాకు నేనే ప్రశ్నించుకున్నా అన్నారు. సినిమాల ద్వారా ఎంత చెప్పినా జనం మారరు. మహా అయితే ఆ ప్రభావం ఒకరోజు ఉంటుందేమో అన్నారు. మనం ఎవరినైనా స్ఫూర్తిగా తీసుకుంటున్నామంటే వాళ్లు ఎన్నో దెబ్బలు తిన్నవారు, త్యాగాలు చేసిన వారు.

మనలో మనం ఇది తప్పు ఇది ఒప్పు అని ఆలోచించుకోవాలి అన్నారు. మన తప్పులను మనమే సరిచేసుకోకపోతే అది మనకే నష్టం. అందుకే నన్ను నేను కూడా వెనకేసుకురాను. తప్పయితే తప్పని చెబుతా. క్షమాపణ కోరతా, తప్పు చేస్తే సరిదిద్దుకుంటా. పొరపాట్లు జరగవచ్చు కానీ, కావాలని తప్పులు చేయను. మున్ముందు ఏదైనా జరిగితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే. మీరంతా కష్టపడి వచ్చారు. ఇప్పుడు అందరూ హెచ్‌1-బీ వీసా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదీ లెక్క చేయకుండా నా కోసం వచ్చారు. మీ ఆశీస్సులు, దీవెనలు నాకు చాలు. రాష్ట్ర అభివృద్ధికి మీరు నిర్మాణాత్మకంగా ఉండాలి. మనిషి స్వభావ రీత్యా మంచివాడు.

స్వతహాగా మంచితనం ఉంటుంది. ఎప్పటికైనా మారతారని నమ్మకం. అందుకే నేను మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతా. ఇక వీళ్లు మారరు అన్నప్పుడే చాలా బలంగా మాట్లాడతా. అప్పుడు నేను భయపడను. మీరు ఉన్న చోట నుంచి మీకు ఎంత కుదురుతుందో అంతే చేయండి. ప్రవాసులకు ప్రత్యేక సంబంధాలు ఉంటాయి. ఉద్దానం సమస్యకు హార్వర్డ్‌ వైద్యులను ఇక్కడ చదువుకున్న ఓ విద్యార్థి కదిలించాడు. ప్రవాసులకు చాలా మంది స్నేహితులు ఉంటారు. చాలా మంది పెట్టుబడిదారులు ఉంటారు. మనవాళ్లకు ఉద్యోగాలు కావాలి. మీ పరిచయాలు కానీ, నెట్‌వర్క్‌ కానీ వారిని కదిలించవచ్చు.

ఒక సత్యాన్ని ఆవిష్కరింపచేయడానికి ప్రయత్నించినప్పుడు కచ్చితంగా వారికి శత్రువునవుతా. అది తట్టుకుని నిలబడానికి చాలా ధైర్యం కావాలి. అందుకే సత్యమేవ జయతే అంటే సత్యం గెలుస్తుందని కాదు, సత్యం మాత్రమే గెలుస్తుందని అర్ధం అన్నారు. ఇది మనదేశంలో మాత్రమే ఉంది. ఏ దేశంలోనూ లేదు. ఒక రాజకీయ నాయకుడి క్యారెక్టర్‌ను ఇక్కడి వివాదాస్పద రాజకీయ నాయకులు మార్చేశారు. మనందరం వాళ్లకు ఊడిగం చేయాలి. వాళ్లు మనల్ని దోచుకుంటారు. మనం పన్నులు కడతాం. వాళ్లు ఒక్కరు కూడా కట్టరు. ఏదైనా అంటే దాడులు చేస్తున్నారు అంటారు.ఒకప్పటి రాజకీయాల్లో ఒక ఆలోచనా విధానం ఉండేది. ఆ తర్వాత కుల ప్రాతిపదికన రాజకీయాలు వచ్చేశాయి. సమాజాన్ని సమగ్రంగా చూసే ఆలోచనా విధానం లేదు.

భవిష్యత్‌లో నేను తప్పు చేస్తే నన్ను వెనకేసుకురావొద్దు. చట్టానికి దొరక్కుండా పనిచేయగలం అనుకుంటారు. చట్టానికి దొరక్కపోవచ్చు. ధర్మానికి దొరికిపోతారు. దాని నుంచి తప్పించుకోలేరు. ఎవరైనా సరే ఐదేళ్లు తప్పించుకోవచ్చు. పదేళ్లు తప్పించుకోవచ్చు. తప్పులు చేసినవాళ్లు ఎప్పటికైనా దొరికిపోతారు. దేశానికి ఉన్న శక్తి అది. పదిమంది దోచుకుంటే ఒక్కడైనా పీడిత పక్షాన నిలబడతాడు. నేను మిమ్మల్ని కోరేదేంటంటే. మీరు ఏ స్థాయిలో పనిచేయగలరో చూసుకోండి. ఓట్ల ద్వారా నేను అడిగేది సామాజిక మార్పు. ఆత్మగౌరవం ఉండాలి. తిరిగి మీరు ఇక్కడికి వస్తే ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతి, ఆఫీస్‌కు వెళ్లడానికి ఇబ్బంది పడకూడదు. అలాంటి పరిపాలనా విధానం మనదేశంలో రావాలి అని పవన్‌కల్యాణ్‌ అన్నారు…

  •  
  •  
  •  
  •  

Comments