రెండుమూడు రోజుల్లో అందరి జీవితాలు బయటపెడతా : కత్తి మహేష్

Monday, May 14th, 2018, 05:49:07 PM IST

టాలీవుడ్ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఇదివరకు పవన్ కళ్యాణ్ అభిమానులతో కొన్నాళ్లపాటు గొడవకు దిగి చివరకు జనసేన పార్టీనుండి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టమని ప్రకటన రావడంతో ఆ గొడవ విషయంలో వెనక్కితగ్గి, తరువాత ఏకంగా పవన్ ఫాన్స్ తో పార్టీ కూడా చేసుకున్నారు. అయితే ఆ తరువాత అక్కడక్కడా పవన్ పై జనసేనపార్టీ పై అక్కడక్కడా కొద్దిపాటి విమర్శలు చేస్తూ వస్తున్న ఆయన, గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కానీ న్యూస్ చానెల్స్ లో కానీ యాక్టివ్ గా లేరనే చెప్పాలి. అయితే వున్నట్లుండి హఠాత్తుగా ఆయన సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ లో ఒక ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం సునీత అనే మహిళా ఒక మీడియా ఛానెల్ వేదికగా కత్తి మహేష్ పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే అవి కేవలం నిందారోపణలని, ఆ మహిళా ఒక తనపై ఒక ఛానెల్ లో ఒకలా, ఇంకొక ఛానెల్ లో మరొకలా ఆరోపణలు చేసినపుడు అవి ఎవరో తనపై కుట్రపన్ని దగ్గరుండి పలికించినవి అని ప్రజలకు అర్ధమైంది అన్నారు.

నిజానికి తనకు ఈ విషయమై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని, అయితే తాను పబ్లిక్ డొమైన్ లో వున్నపుడు ఇటువంటివాటిపై క్లారిటీ ఇచ్చుకోవాలని, అందుకే ఇలా వీడియో చేస్తున్నట్లు చెప్పారు. నిజానికి తాను టాలీవుడ్ హీరోలపై, ఇండస్ట్రీ సమస్యలపై తనవంతు పోరాటం చేస్తున్నానని, శ్రీ రెడ్డి విషయంలో కూడా తన మద్దతు తెలిపానని అన్నారు. అయితే కొందరు సో కాల్డ్ పెద్ద మనుషులు కావాలనే తనపై ఇలా బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అసలు ఆ మహిళ వెనుక ఎవరున్నారో తేలాలని, ఒకవేళ ఆమె వెనుక ఎంత పెద్ద స్టార్ ఉన్నప్పటికీ ఈ విషయాన్నీ వదిలేది లేదన్నారు. అందుకే తనపై అసత్య ఆరోపణలు చేసిన సునీత పై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా కూడా వేస్తున్నానని తెలిపారు. ఇకపై ఎవరికి భయపడేదికానీ, ఉపేక్షించేది కానీ లేదన్నారు. నాపై విమర్శలు చేస్తున్న వారు మాత్రం ఇంకొక రెండు మూడు రోజులు ఓపిక పట్టండి, ఎవరి జీవితాలు, జాతకాలు ఏంటో బయటపెడతాను అని హెచ్చరించారు…..