ఏపీకి ప్రత్యేక హోదా కోసం జాగరణ : నటుడు శివాజీ

Monday, May 7th, 2018, 08:26:53 PM IST


ప్రధాని మోడీ, చంద్రబాబులు కలిసి అప్పుడేమో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఇప్పుడేమో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రత్యేక హోదా, విభజనహక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు శివాజీ అన్నారు. ఏపీకి హోదా కోసం తాను ఈ నెల 10వ తేదీన రాత్రి 7 గంటలనుండి 11వ తేదీ ఉదయం 7 గంటలవరకు జాగరణ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మోడీ ప్రభావం దేశంలో చాలావరకు తగ్గిపోయిందని, ఆయన గద్దెదిగే సమయం ఆసన్నమయిందని అన్నారు. నేటి నేతలకు ప్రజలకు ఏదైనా మేలు చేయాలి అనే దానికంటే, వారు కూర్చున్న కుర్చీ మీదనే ఆకాంక్ష పెరిగిపోయిందని విమర్శించారు.

బ్రతికివున్నన్ని రోజులు ప్రధానిగానే ఉండాలి అనే ఆశ దేశానికే తీవ్ర నష్టం తెస్తుందని, మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో కులాలను రెచ్చగొట్టి మనలో మనకే అంతర్గత కలహాలు రేపెలా నేటి ప్రభుత్వం పాలన సాగుతోందని, తాను చేసే దీక్షకు కుల, మత బేధాలు లేకుండా అందరూ మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి పట్టించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అంశాన్ని ప్రస్తుతం లేవనెత్తారని, అయినా ఆ తిరుమలేశుడిని, అలానే తిరుమలను ఐదు కోట్లమంది ప్రజలు జాగ్రత్తగా కాపాడుకుంటారని అన్నారు…..

Comments