నేను ఎప్పటికీ భారతీయురాలినే : సానియా మీర్జా

Friday, April 13th, 2018, 06:56:52 PM IST

నిన్న జమ్ము కశ్మీర్ లో ఎనిమిదేళ్ళ చిన్నారి ఆసిఫాపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కథువాలో జరిగిన ఈ దారుణంపై లిఖితపూర్వకంగా న్యాయవాదులు ఫిర్యాదు సమర్పిస్తే విచారణకు సిద్ధమేనని ప్రకటించించింది. ఆసిఫాకు జరిగిన అన్యాయంపై పలువురు సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఆ ఘటనపై స్పందించింది.

అయితే సానియా జాతీయతను ప్రశ్నిస్తూ ఆమె ట్వీట్ కు ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీనికి సానియా కూడా ఘాటుగా బదులిచ్చింది. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రపంచానికి మనం నిజంగా ఇలాంటి దేశాన్ని చూపించాలనుకుంటున్నామా, కుల మత వర్ణ ప్రాంతాలకు అతీతంగా అందరం ఈ 8 ఏళ్ల బాలిక తరపున నిలబడాలి. లేకుంటే ప్రపంచంలో మరే విషయానికి అండగా నిలబడినట్లు కాదు. అది మానవత్వం అని కూడా అనిపించుకోదు. ఆ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది అని సానియా ట్వీట్ చేసింది. దానికి ఓ వ్యక్తి ఆమె జాతీయతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సానియా ట్వీట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ ఆమె జాతీయతను ప్రశ్నించాడు.ఆమె పాకిస్తాన్ వ్యక్తిని వివాహం చేసుకుందని పాక్ ఉగ్రమూకల చేతిలో బలవుతున్న అమాయకులపై కూడా ట్వీట్ చేయాలని కామెంట్ పెట్టాడు.

ఆ వ్యాఖ్యలకు సానియా ఘాటుగా రిప్లై ఇచ్చింది.‘‘ఓ వ్యక్తి ఏదేశం వ్యక్తినైనా పెళ్లి చేసుకోవచ్చు. నేను ఏ దేశస్తురాలినో నీలాంటి అథమ స్థాయి వ్యక్తులు చెప్పక్కర్లేదు. నేను భారత దేశం కోసమే ఆడతాను. నేను ఇప్పటికీ ఎప్పటికీ భారతీయురాలిగానే ఉంటాను. ఒకవేళ నువ్వు దేశం మతాలకు అతీతంగా ఆలోచించగలిగితే, ఒకనాటికి మానవత్వం వైపు కూడా నిలబడతావు’’ అంటూ సానియా బదులిచ్చింది….