8వ తరగతి చదివిన ఆయనకు మంత్రి పదవి ఇవ్వకూడదా : కుమార స్వామి

Sunday, June 10th, 2018, 11:30:24 PM IST

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలు ఎంత ఉత్కంఠతతో, రసవత్తరంగా జరిగాయో అందరికి తెలిసిందే. అత్యధిక సీట్లు కైవశం చేసుకున్న బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేక చతికిలపడింది. అయితే చివరకు అక్కడ రెండవ మరియు మూడవ స్థానాలు పొందిన కాంగ్రెస్ మరియు జేడీఎస్ లు కలిసి ప్రబుత్వాన్ని ఏర్పాటు చేయగా, జేడీఎస్ పార్టీ అధినేత కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే అప్పటినుండి ఎవరెవరికి ఏయే మంత్రిత్వ శాఖలు అప్పగించాలి అనేదానిపై ఆయన ప్రభుత్వం తలమునకలవుతోంది. కాగా మొన్న జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలోని చాముండేశ్వరి స్థానంనుండి గత సీఎం గా పనిచేసిన సిద్దరామయ్యను ఓడించి తన సత్తా నిరూపించుకున్న జేడీఎస్ నేత జిటి దేవెగౌడ ను కుమారస్వామి తన క్యాబినెట్ లోకి తీసుకుని ఆయనకు మంత్రి పదవి అప్పజెప్పారు. అయితే ఈ విషయమై చిన్నపాటి వివాదం తలెత్తడంతో అక్కడి నేతలు, మీడియా వారికీ కుమారస్వామి వివరణ ఇచ్చారు.

నన్ను చాలామంది మీడియా మిత్రులు అలానే రాజకీయవేత్తలు జిటి దేవెగౌడ గారి విద్యార్హత కేవలం 8వ తరగతి మాత్రమే, మరి అటువంటి వ్యక్తికి విద్యశాఖామంత్రిగా పదవి ఎలా ఇచ్చారని అడుగుతున్నారు అని అన్నారు. నిజానికి తాను బిఎస్సి చదివానని, అంటువంటి తాను ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించగా లేనిదీ, 8వ తరగతి చదివిన ఆయనను విద్యాశాఖ మంత్రిగా నియమించకూడదా అని అన్నారు. అందరికి అన్ని శాఖల్లోనూ అనుభవం ఉండదని, వాస్తవానికి ఎవరికి వారికీ నచ్చిన శాఖలో పనిచేయాలని ఉంటుందని, కానీ అన్ని శాఖల్లోనూ సమర్ధవంతంగా పనిచేసి విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసారు. అయితే ఈ విషయమై జిటి దేవెగౌడ మాత్రం కొంత అసంతృప్తిగా వున్నారని, తన స్థాయికి తగ్గట్లు చిన్నతరహా నీటిపారుదల శాఖను కేటాయించినట్లయితే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్గతంగా అందరితో చర్చించి ఈ పదవులపై నిర్ణయం తీసుకున్నామని, చిన్నపాటి అసంతృప్తులు ఏమైనా ఉంటే అవి త్వరలోనే తొలగిపోతాయని ఆయన అన్నారు…..