48గంటలు సమయం ఇస్తున్నా, లేకుంటే నిరాహార దీక్ష చేస్తా : జనసేన అధినేత పవన్

Wednesday, May 23rd, 2018, 12:31:12 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజా పోరాట యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఈ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు ప్రజలనుండి కూడా మంచి మద్దతు లభిస్తోందని జనసేన వర్గాలు చెపుతున్నాయి. మొన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పర్యటించిన పవన్, ప్రస్తుతం పలాసలో పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా నేడు అక్కడ స్థానిక నేతలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న పవన్ టీడీపీ ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలపై నిప్పులు చెరిగారు. ఎంత మంది నేతలు వస్తున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇక్కడి ప్రజల బ్రతుకుల్లో మాత్రం కొంచెం కూడా మార్పు రావడం లేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడివారికి అన్నివిధాలా అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉద్దానం కిడ్నీ సమస్యల పై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.

ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ఈ విషయమై చర్చించానని, అంతేకాక అమెరికా కూడా వెళ్లి అక్కడి డాక్టర్లను ఇక్కడి సమస్య వివరిస్తే వారు కూడా దయార్ద్ర హృదయంతో సాయం చేస్తామని చెప్పారు అన్నారు. కానీ ప్రభుత్వం ఆ తరువాత ఈ సమస్యను పట్టించుకోకుండా పక్కన పెట్టిందని, ఇక తన సహనం నశించిందని అందుకే రానున్న 48 గంటలలోగా ఆరోగ్య శాఖామంత్రి గారు, అలానే హెల్త్ సెక్రటరీ ఉద్దానం కిడ్నీ బాధితులకు అవసరమైన సాయం అందించడానికి ముందుకు రావాలని, లేకుంటే 48 గంటల తర్వాత తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని పవన్ హెచ్చరించారు. అసలు ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వం వున్నా, లేకపోయినా ఒకటేనని, కావున తాను చెప్పిన గడువులోగా ఇక్కడి ప్రజల సమస్యకు పరిష్కారం చూపకపోతే చెప్పినట్లుగా దీక్ష చేసి తీరుతానని, ఇది ప్రభుత్వానికి తన హెచ్చరిక అని స్పష్టం చేశారు…..

  •  
  •  
  •  
  •  

Comments