నేను హిందువుల వ్యతిరేకిని కాదు: ప్రకాష్ రాజ్

Friday, January 19th, 2018, 11:35:56 AM IST

విలక్షణ నటులు ప్రకాష్ రాజ్ ఈ మధ్య సోషల్ మీడియా లో తనదైన శైలిలో బిజెపి నేతలపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రముఖ లేడీ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసు పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించకపోవం పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గౌరీ లంకేశ్ హత్యను కొందరు సెలెబ్రేట్ చేసుకున్నారని, ఈ విషయమై ప్రధాని మౌనం వహించడం సరైనది కాదని ఆయన అన్నారు. బిజెపి నేతలను కొన్నాళ్ళనుండి ప్రకాష్ రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’ పేరుతో తన ట్విట్టర్ ఖాతా ద్వారా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించడానికి రాజ్యాంగ సవరణ చేస్తామని కేంద్ర మంత్రి హెగ్డే చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మొన్నబెంగళూరు లో ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగించి వెళ్ళాక బిజెపి యువ మోర్చా కార్యకర్తలు గోమూత్రం తో ఆ చోటును శుభ్రం చేసిన విషయం సంచలనం రేపింది. దానికి ప్రతిస్పందనగా ఈ విధంగా గోమూత్రం తో శుభ్రం చేయడం బాగుంది, కానీ నేను వెళ్లే ప్రతిచోటుని వారు ఇలానే శుభ్రం చేస్తారా అని తనదైన శైలిలో ట్విట్టర్ లో ప్రశ్నించారు. కారణాలు ఏవైనా మనుషులపై దాడులు చేసి చంపడం తప్పని, అలా దాడులు చేసే వారికి సహాయం చేసేవారు హిందువులు కాదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజంగా ఒక హిందువు అటువంటివారికి మద్దతుగా నిలవడనిఅన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల పై తెలంగాణ బిజెపి ప్రతినిధి సాగర్ రావు అభ్యంతరం తెలిపారు. దానికి ప్రతిగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తనని హిందూ వ్యతిరేకి అంటున్నవారు అసలు హిందువులే కాదు అని చెప్పడానికి తనకి పూర్తి హక్కు ఉందన్నారు. ఇటీవలి ఒక సభలో ఆయన ప్రసంగిస్తూ తాను హిందువులకు ఎప్పుడు వ్యతిరేకం కాదని, కేవలం మోడీ-అమితాషా-హెగ్డేలకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. బిజెపి నేతల పై ఈ విధంగా మాట్లాడుతున్న తనను జాగ్రత్తగా ఉండమని పలువురు సలహాలు ఇస్తున్నారని, అయితే తన పై ఇప్పటివరకు ఎటువంటి ప్రత్యక్ష దాడులు జరగలేదని, అలానే ఎటువంటి హెచ్చరికలు కూడా అందలేదని చెప్పారు. కొందరు పరోక్షంగా తన చిత్రాలకు యాడ్స్ రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని, అటువంటి వాటికి తాను భయపడేదిలేదని అన్నారు. ఏది ఏమైనప్పటికి బిజెపి నేతలపై ప్రకాష్ రాజ్ వ్యవహరించే తీరును చూస్తే ఇది భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని జనం అభిప్రాయపడుతున్నారు..