ఫైనల్ వార్ : ఎవరి బలం ఎంత?

Sunday, June 23rd, 2013, 10:27:01 AM IST

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గెలిచేందుకు ఇంగ్లండ్, టీమిండియాలు సిద్ధమయ్యాయి. చివరి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని ఇరుదేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి. హోం గ్రౌండ్ లో ఆడటం ఇంగ్లీష్ టీంకు అడ్వాంటేజ్ అవనుంది. మరోవైపు వరుస విజయాలతో ఊపుమీదున్న ఇండియా.. ట్రోఫీ గెలుస్తామన్న ధీమాతో ఉంది. ఇంగ్లండ్ తో పోలీస్తే టీంఇండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇంతకీ ఎవరి స్ట్రెంత్ ఎంత?

తమ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ లపై ఇరుజట్లు నమ్మకంతో ఉన్నాయి. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ చూసినట్టయితే కెప్టెన్ అలిస్టెర్ కుక్ ఫాంలో ఉన్నాడు. ఇతనితో పాటు జో రూట్, జొనాథన్ ట్రాట్, బొపారాలు బ్యాటింగ్ లో రాణించగల ఆటగాళ్లు. బౌలింగ్ లో జేమ్స్ అండర్సన్, ఫిన్, స్టువర్ట్ బ్రాడ్, స్పిన్ బౌలర్ ట్రెడ్ వెల్ లు ఫాంలో ఉన్నారు.

టీమిండియా బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. ప్రతీ బ్యాట్స్ మెన్ ఫాంలో ఉన్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో అదరగొట్టాడు. అంతే కాకుండా ప్రతీ మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్ లో ధావన్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాలని టీం కోరుకుంటోంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా సూపర్ టచ్ లో ఉన్నారు. వీళ్లు మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇక సురేశ్ రైనా భారీ స్కోరు కోసం తహతహలాడుతుండగా.. దినేశ్ కార్తీక్, ధోనీ, జడేజాలు తమ బ్యాట్లకు పని చేప్పేందుకు రెడీ అయ్యారు. ఏ రకంగా చూసినా ఇంగ్లండ్ బ్యాటింగ్ కంటే భారత బ్యాటింగే బలంగా, కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది.

టీమిండియా బౌలర్లు ఈ సిరీస్ ఆద్యంతం అదరగొడుతున్నారు. సీమర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. ప్రతీసారి భువనేశ్వర్ టీమిండియాకు బ్రేక్ ఇస్తుండగా.. ఇషాంత్ లాంఛనం పూర్తి చేస్తున్నాడు. ఈ సిరీస్ లో ఇషాంత్ శర్మ ఇప్పటికే రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

స్పిన్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు మరోసారి మ్యాజిక్ స్పెల్ వేసేందుకు పోటీపడుతున్నారు. గత మ్యాచ్ లో అశ్విన్ సత్తా చాటగా.. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు తీసి జడేజా తన కెరీర్ బెస్ట్ ను నమోదు చేసుకున్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ల ఆటకట్టించేందుకు ఈ ఇద్దరు స్పిన్నర్లు సిద్ధమయ్యారు.

ఇరుజట్లలో సూపర్ ఫాంలో ఉన్న స్టార్ ఆటగాళ్ల మధ్య ఇంట్రెస్టింగ్ కాంటెక్ట్స్ జరగనుంది. ఇంగ్లండ్ పేస్ బౌలర్ అండర్సన్.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ను టార్గెట్ చేశాడు. ఈ ఇద్దరూ అద్భతంగా రాణిస్తుండడంతో వీళ్లిద్దరి మధ్య గేమ్ ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ వికెట్ తీయాలని ఆరాటపడుతున్నాడు. ఇంగ్లండ్ పిచ్ లపై స్వింగ్ బౌలింగ్ తో అదరగొడుతున్న భువీ, కుక్ ల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.