ప్చ్.. భారీ స్కోర్స్ లేవు.. మెరుపులు లేవు..

Thursday, June 13th, 2013, 05:28:53 PM IST

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ చప్పగా సాగుతోంది. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీకి ఊపురాలేదు. అన్ని టాప్ టీమ్సే ఆడుతున్నా.. భారీ స్కోర్లు నమోదు కావడంలేదు. తక్కువ స్కోర్లు నమోదు అవుతుండడంతో మ్యాచ్ లపై ఇంట్రెస్ట్ తగ్గింది. లో స్కోర్లను కాపాడుకోవడంలోనూ కొన్ని టీమ్స్ విఫలమవుతున్నాయి.

8 టాప్ టీమ్స్ పాల్గొంటున్న ఇంతవరకు అదరిపోయే మ్యాచులు జరగలేదు. ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భారీ స్కోర్లు నమోదు కావడంలేదు. ఒక్క ఇండియా సౌతాఫ్రికా మ్యాచ్ లో మూడు వందల పై చిలుకు పరుగులు వచ్చాయి తప్పా.. మిగతా మ్యాచులన్నీ లోస్కోరింగులే నమోదు అయ్యాయి.

పాకిస్తాన్ వెస్టిండీస్ తో స్టార్టయినా లోస్కోరింగ్ మ్యాచులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. విండీస్ బౌలర్ల దెబ్బకు పాక్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. చిన్న టార్గెట్ ను ఛేజ్ చేయడానికి విండీస్ చాలా కష్టపడింది. ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాది అదే పరిస్తితి. ఇక శ్రీలంక న్యూజీలాండ్ మ్యాచ్ మరీ ఘోరం.. మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు పట్టుమని 150 పరుగులు కూడా చేయలేదు. ఈ చిన్న టార్గెట్ ను ఛేజ్ చేయడానికి న్యూజీలండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి పరాజయ అంచుల్లోకిపోయి మరీ గెలిచింది. పాకిస్తాన్, సౌతాఫ్రికా మ్యాచులోనూ మెరుపులు లేవు.

లో స్కోర్లు నమోదు కావడానికి ఇంగ్లండ్ క్లైమెట్ కండీషన్స్ తో పాటు టీ-ట్వంటీ హ్యాంగోవర్ కూడా తోడైంది. దాదాపు అన్ని జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీ ట్వంటీ సిరీస్ లో, ఐపీఎల్ టోర్నీ ఆడి వచ్చాయి. ఇంకా ఆ మూడ్ లోనుంచి బయటకు రావడంలేదు. ఇక నుంచి జరిగే మ్యాచుల్లో అయినా భారీ స్కోర్లు నమోదు అయి జనరంజకంగా ఉంటాయని ఆశిద్దాం.