ఐడియా, ఎయిర్‌టెల్ అను చెవిలో పువ్వులు?

Wednesday, October 17th, 2018, 03:00:05 PM IST

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క ఎయిర్‌టెల్ జీవితంలో పైపైకి తీసుకెళుతుంది. ఈ మాట‌ న‌మ్మి సిమ్ములు కొనుక్కుంటే ఒక‌టే టార్చ‌ర్. గ‌తంలోలాగా సిగ్న‌ల్ వ‌స్తుంద‌ని ఆశ‌గా ఎదురు చూస్తే అంతే సంగ‌తి. ఆఫీస్‌లో బాస్ ఫోన్ చేస్తుంటే యంగేజ్ వ‌స్తోందా..? ఎడిట‌ర్ ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని మెంట‌లెక్కిస్తోందా? నాన్న‌ న‌డిసంద్రంలో మునిగాను.. కాపాడు బాబూ! అని ఫోన్ చేశాడా? ఏం ఉప‌యోగం.. అస‌లు ఫోన్ క‌నెక్ట‌యితే క‌దా? యాక్సిడెంట్‌లో ఫ్రెండు పోయాడు అన్న సంగ‌తి పొద్దున్నే తెల‌వ‌దు.. సాయంత్రానికి మెసేజ్ వ‌స్తుంటుంది. ఇలాంటి అనుభ‌వాలెన్నో.. ఎన్నెన్నో. ఇలాంటి అనుభ‌వాలు ఎక్క‌డో కొండ‌ల్లోనో, మారుమూల ప్రాంతాల్లోనో అనుకుంటే పొర‌పాటే. సాక్షాత్తూ హైద‌రాబాద్ న‌డిబొడ్డున‌, గచ్చిబౌళిలో, యూస‌ఫ్ గూడ‌లో, చిత్ర‌పురి కాల‌నీలో వేలాది నెట్‌వ‌ర్క్‌లు నిరంత‌రం స్థంభించిపోతూనే ఉన్నా వీటిని ప‌ట్టించుకునే నాధుడే లేడాయే.

జియో కొట్టిన దెబ్బ‌కు అన్ని నెట్‌వ‌ర్క్‌లు జామ్ అయిపోతున్నాయ్‌. నెట్ వ‌ర్క్‌ల‌న్నీ గంద‌ర‌గోళంలో ప‌డ్డాయి. ఏవీ స‌రిగా సిగ్న‌ల్ క్యాచ్ చేయ‌వు. ఇంట‌ర్నెట్ ఆఫ‌ర్లు పేరుకే కానీ అస్స‌లు ప‌ని చేయ‌వు. న‌గ‌రాల్లోనే అస‌లు సిగ్న‌ల్ రాదు. ఏదో ఒక నెట్ వ‌ర్క్‌యేనా? అనుకుంటే ఆ రెండు నెట్‌వ‌ర్క్‌లు టాప్ అనుకుంటే అవే బుర్ర‌లు బాదుకునే ప‌రిస్థితి.. అపార్ట్‌మెంట్ల‌లో రెండు పాయింట్లు ప‌డ‌డం గ‌గ‌నం. రెండు మూడు పాయింట్ల సిగ్న‌ల్ క‌నిపించినా, వాయిస్‌ వినిపించదు. ఇలాంటి దారుణ‌ అనుభ‌వం ఆధునిక ప్ర‌పంచంలో టెక్నాల‌జీ వ‌ర‌ల్డ్‌లో ప‌గ‌వాడికైనా ఎదురు కాకూడ‌దు. ఈ టెక్నాలజీ ఇలా దిగ‌జారిపోయి చివ‌రికి పాత రోజుల్లో ల్యాండ్ ఫోన్ బెట‌ర‌నిపిస్తుందేమో! ఐడియా, ఎయిర్‌టెల్ దౌర్భాగ్య ంపై ప్ర‌ఖ్యాత తెలుగు టీవీ చానెల్ తాట తీసింది. ప్ర‌స్తుతం జ‌నాల్లో ఇదో హాట్ టాపిక్.