భూములు లాక్కుంటే ఎదిరించండి… మీ వెంట నేనుంటా!!

Sunday, July 22nd, 2018, 05:30:45 PM IST

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాక ఏపీకి నూతన రాజధాని, అలానే ఇక్కడి ప్రజలకు సరైన పాలన అందిస్తారని నమ్మకంతోనే అప్పట్లో టిడిపికి అలానే ముఖ్యమంత్రి చంద్రబాబుకి తాను మద్దతు ఇవ్వడం జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. నేడు తన యాత్రలో భాగంగా ఉండవల్లి ప్రాంతంలోని రైతులను కలిసిన అయన వారికి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని భూముల విషయమై ఇప్పటికే ప్రభుత్వం వారు అవసరానికి మించి భూములను తీసుకున్నట్లు తన వద్దకు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఇప్పటికి చేసిన భూ సేకరణ చాలునని, ఇకపై ఎవరైనా మీ భూములను భూ సేకరణ కోసం ఇమ్మని అడిగితే అటువంటి వారిని తీవ్రంగా ప్రతిఘటించండి. ఆపై మీ వెనుక నేను వుంటాను, అవసరం అయితే నా గుండెని మీకు అడ్డం పెట్టి నిలబడతానని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో ప్రజల సమస్యలు పూర్తిగా గాలికి వదిలేసిన టీడీపీ పార్టీ ప్రజలను రక్తం తాగే జలగలు లాగ పీడించుకుని తింటోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి మంత్రులు, ఎమ్యెల్యేలు ముఖ్యంగా భూ బకాసురులు ఎక్కువయ్యారని, చంద్రబాబు గారు మీరు అంతా చూస్తున్నారు కదా, అటువంటి వారిని మీ దరి దయచేసి చేరనివ్వకండి, ఇది నా విజ్ఞప్తి అంటూ అయన మాట్లాడారు. రైతుల భూములు అక్రమంగా లాక్కుని వాటిని బీడు భూములుగా మార్చడం అక్రమం, దారుణానమని, రైతు కంట కన్నీరు పెడితే రాష్ట్రానికే చేటని అన్నారు. ప్రభుత్వం ఇక్కడి నేలని మరొక బషీర్ బాగ్ ప్రాంతంగా చేయాలనుకుంటే మాత్రం తాను సహించేది లేదని, ప్రాణాలువొడ్డి అయినా సరే వారిని ఎదిరించి తీరుతానని హెచ్చరించారు.

అయితే అధికారులను, పోలీస్ లను ప్రజలు తప్పుగా అర్ధం చేసుకోవద్దని, ప్రభుత్వ ఆదేశాల మేరకే వారు ప్రవర్తిస్తారనే విషయాన్నీ అందరూ గుర్తించాలని అన్నారు. రాజ్యాంగం అందరికి సమానమని, పెద్దోళ్ళు ఇలా అక్రమాలు చేస్తూ మరింత పెద్దోళ్ళు అవుతుంటే రైతులు, మధ్య, దిగువ తరగతులవారు మరింత పేదవారుగా మారుతున్నారని అన్నారు. రాజ్యాంగం అనేది అందరికి సమానమని, ఈ దేశంలో ఎవరు కూడా మరొకరికి బానిసలూ కాదనే విషయాన్నీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి అన్నారు. మీ అందరూ తన ముందుండి రాబోయే ఎన్నికల్లో జనసేనను గెలిపిస్తే తప్పకుండ అందరికి సమన్యాయం చేయగలనని, పెత్తందారీతాం, దొరతనాలకు తాను కానీ జనసేన కానీ పూర్తిగా వ్యతిరేకమని అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments