హోదా సాధ్యమైతే ప్రతి జిల్లా ఒక హైద్రాబాద్ అవుతుంది: వైఎస్ జగన్

Sunday, February 11th, 2018, 09:23:46 AM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 83వ రోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోడగుడిపాడు వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం తాను ఊపిరున్నంత వరకూ పోరాడుతానని, స్పష్టం చేశారు. విభజన సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ అయిన హోదా కోసం నాలుగేళ్లుగా తాము పోరాడుతుంటే అడుగడుగునా అడ్డుతగిలిన చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేసే ప్రత్యేక హోదాను సాధించి తీరుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో గొప్పగా చేసిందని, రాష్ట్రానికి రావాల్సిన వన్నీ వచ్చేశాయని అప్పట్లో ఊదరగొట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో ఏడాదిలో ఎన్నికలొస్తున్న నేపథ్యంలో బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

అయితే ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుని సీమాంధ్ర వ్యాప్తంగా చాలా ఉధృతంగా పోరాటాలు జరుగుతున్న సమయం అది, మరోవైపు తమ ప్రాంతం సరిగ్గా అభివృద్ధి కావడం లేదని తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రాంతం వారూ పోరాడుతున్నారు. అయితే కేంద్రం ఎదుట ప్రత్యామ్నాయాల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు సమైక్యాంద్ర కోరుతున్న సీమాంధ్ర వాదులంతా ఒక ప్రత్యామ్నాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తమకు అభ్యంతరం లేదని ఒప్పుకున్నారు. అలానే హైదరాబాదు నగరాన్ని మాత్రం రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉండగల ఉమ్మడి ఆస్తిగా పరిగణించడం, హైదరాబాదు మనది అనే భావన ఉంటే చాలు, ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా మాకేం అభ్యంతరం లేదంటూ, సీమాంధ్ర ప్రజలు ఆకాంక్షించారు. హైదరాబాదు కావాలని అంత పట్టు పట్టడానికి గల కారణం అందరికీ అక్కడ ఆస్తులన్నాయని కాదు. ఆస్తులు కొందరికే ఉంటాయి, కానీ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అక్కడే కేంద్రీకృతం అయిందని అందరి భావన. అంత అభివృద్ధి తాము వేరుపడితే ఎప్పటికీ చూడలేం అని సీమాంధ్రులు అనుకున్నారని అన్నారు.

ఒక వేళ రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే ప్రత్యేకహోదా సాధించేవరకు అవిశ్రాంతంగా పోరాడుతాం అని, ఒక వేళ అది కనుక సాధ్యం అయితే పారిశ్రామికీకరణ ఇబ్బడిముబ్బడిగా జరుగుతుందని జగన్ చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా కూడా ఒక హైదరాబాదు లాగా తయారు కాగలదని ఆయన అన్నారు. తాను అన్న ప్రకారం ప్రతి జిల్లా ఒక హైదరాబాదు అంటే కేవలం అభివృద్ధి కోణంలో మాత్రమే దీనిని చూడాల్సి ఉంటుందని, అంటే ఆ నగరంతో సమానమైన పురోగతిని దాదాపుగా ప్రతి జిల్లాలోనూ చూడగలం అని ఆయన పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు పారిశ్రామికీకరణ రూపంలో ఇది నిజం అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు…. .