రైలు లేటుగా వచ్చిందో….. అధికారులకు మూడిందే!

Sunday, June 3rd, 2018, 09:06:07 PM IST


కేంద్ర రైల్వే శాఖామంత్రి పీయూష్ గోయల్ నేడు తీసుకున్న ఒక నిర్ణయంపై దేశ ప్రజలు అందరూ సర్వత్రా అమిత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రైళ్లు స్టేషన్ లకు ఆలస్యంగా రావటం వంటివి చాలానే చూసి చూసి విసిగిపోయాం. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం పెట్టుకున్నప్పుడు రైలు సమయానికి రాకపోయినా, ఏదైనా జాప్యం వలన గమ్యానికి ఆలస్యంగా చేరుకున్నా ఆ ఇబ్బందిని వర్ణించలేం. అందుకే ఇటువంటి ఆలస్యాలకు ఇకపై చెక్ పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం. నేడు ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రసంగించిన కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇకపై ఏదైనా స్టేషన్ కు రైలు ఆలస్యంగా వస్తున్నట్లు మాకు ఫిర్యాదులు అందితే సంబంధిత స్టేషన్ తాలూకు జీఎం లకు పదోన్నతులు కల్పన అనేది ఉండబోదని ఆయన స్పష్టం చేసారు. మరీ ముఖ్యంగా ప్రధాన రైల్వే స్టేషన్ లలో రైళ్ల మరమ్మత్తుల నిమిత్తం రైళ్లు ఆలస్యం అవుతున్నట్లు ఫిర్యాదులు మరింత పెరిగాయని, అటువంటివి చేసి ప్రయాణీకులతో నింద వేయించుకునే బదులు సక్రమంగా సమయానికి రైళ్లు నడిపి వారితో భేష్ అనిపించుకుండదామని ఆయన అన్నారు.

ఇప్పటికే ప్రజల్లో చాల మందికి రైళ్ల రాకపోకల సమయాలపై నమ్మకం పోయిందని, ఆ విధమైన నమ్మకాన్ని ప్రజల్లో మళ్ళి మనమే తిరిగి తీసుకొచ్చేలా కృషి చేయాలనీ అయన అన్నారు. ఇకపై దేశంలోని ఏ రైల్వే స్టేషన్ లో అయినా ఆలస్యానికి సంబంధించి ఫిర్యాదులు అందితే అక్కడి సిబ్బంది పై కూడా వేటుపడుతుందని ఆయన హెచ్చరించారు. అలానే సెలవుల సమయాల్లో రైళ్ల సంఖ్యను పెంచేవిధంగా కూడా ఎప్పటికప్పుడు సిబ్బంది చర్యలు తీసుకోవాలని, వాటిల్లో ఎటువంటి జాప్యం చేయకూడదని అన్నారు. ఈ నెల 30లోపు ఇటువంటి ఆలస్యపు ఫిర్యాదులు అన్ని స్టేషన్లలో పూర్తిగా వినపడకూడదని, అప్పటిలోగా అయా స్టేషన్ల సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణీకులకు ఇబ్బంది కలగుండా ఉండేలా చూసుకోవాలని ఆయన అన్నారు…..