అక్కడ ఫాస్ట్ ఫుడ్ కొట్టు… పైకి టిక్కెట్టు పట్టు!

Tuesday, April 3rd, 2018, 12:54:54 AM IST

పట్టణాలలోని పలు ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లు, స్వీట్స్‌ తయారీ కేంద్రాల్లో కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నా అధికారులు మాత్రం అక్కడక్కడా కొన్ని కేంద్రాలపై దాడులు చేస్తుంటారు. అదికూడా మొక్కుబడి అనేది తెలిసిందే. ప్రజారోగ్యం కంటే తమ లాభాపేక్షే అధికంగా ఆలోచించే ఆయా తయారీ కేంద్రాల నిర్వాహకులు కల్తీ నూనె, ముడిసరుకుతో తయారు చేసిన ఆహార పదార్థాలు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇటీవల కాలంలో ఫాస్టుఫుడ్‌ సెంటర్లు, స్వీట్స్‌ తయారీ కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. ఈ కేంద్రాల్లో ఆహార పదార్థాల తయారు చేసే ప్రాంతంలో పూర్తి అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉంటుంది. పదార్థాల తయారీకి వినియోగిస్తున్న వంట నూనె పూర్తి నాశిరకంగా ఉంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వండిన పదార్థాలు ఆకట్టుకునే రంగులో ఉండేం దుకు ఆయా పదార్థాల్లో వాడే ఎసన్స్‌ను ఖాళీ అయిన ఫెర్టిలైజర్స్‌ డబ్బాల్లో నిల్వ ఉంచుతున్నారు.

అలానే బ్యాకరీల్లో ఎగ్‌పఫ్‌, కేక్‌, బ్రెడ్‌ల తయారీలో వినియోగిస్తున్న కోడిగుడ్లు కుళ్లిన వాసన వస్తున్నా వాటినే వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వండేసిన ఆహార పదార్థాలను వంట తయారీ కేంద్రాల్లో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతంలోనే ఉంచుతుంటారు. అయితే ఇటీవల కొద్దిరోజులుగా కృష్ణాజిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ లు తిరువూరులో మాతం దాడులు చేయడం లేదు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉండటం వల్ల జిల్లా అధికారులు ఎవ్వరూ తిరువూరు వరకు రారన్న ధీమాతో కొందరు కల్తీ ఆయిల్‌, కల్తీ ఆహారపదార్థాలు అమ్ముతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉండే వివిధ శాఖ అధికారులు కల్తీ పదార్థాల తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదనే చందంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ ను వివరణ కోరగా ఇటీవల తాము పలు పదార్థాల తయారీ కేంద్రాలను పరిశీలించామని, అక్కడ తాము చూసిన కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. పదార్థాల తయారీ వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని తెలిపారు. పదార్థాల తయారీలో వినియోగిస్తున్న ఆయిల్‌ నల్లగా మారిన తరువాత కూడా మరో పదార్థం తయారీలో వినియోగిస్తున్నట్లు తెలిసిందన్నారు. అలానే నిల్వ ఉంచిన మాంసాహారం, కూరగాయలను వంటల్లో వాడుతున్నారని అన్నారు. తాము ఆయా కేంద్రాలను పరిశీలించి వాటి నిర్వాహకులను హెచ్చరించామన్నారు. ఫాస్ట్‌పుడ్‌ కేంద్రాలను పరిశీలించామని కమిషనర్‌ తెలిపారు. అయితే ఈ నిర్ఘాంతపోయే విషయాలు విన్న అక్కడి ప్రజలు ఇకపై అలాంటి చోట్ల ఫాస్ట్ గుడ్ తింటే ఏకంగా పైకి టికెట్ తీసుకున్నట్లే అని భావిస్తున్నట్లు తెలుస్తోంది….

  •  
  •  
  •  
  •  

Comments