రెండు రోజుల్లో కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పిస్తే కోటి రూపాయలిస్తా…..

Saturday, June 16th, 2018, 12:50:36 AM IST

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు, చేసిన కృషి చెప్పనలవికానిది అని, అయితే ఆ తరువాత రాష్ట్రం కోసం ఎన్నోవిధాలుగా పోరాడిన ఆయన, రాష్ట్ర ప్రజలకు ఎట్టిపరిస్థితుల్లో న్యాయం జరగాలనే తలంపుతో చివరకు నిరాహార దీక్ష చేపట్టి ఎట్టకేలకు రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నా విషయం అందరికి తెలిసిందే అని ఎమ్ఆర్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. అయితే దీక్ష సమయంలో కేసీఆర్ కు నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్ష విరమింపచేసింది నేనే అని, అలా తెలంగాణ ప్రజల కోసం కృషి చేసిన కేసీఆర్ నేడు అదే ప్రజల్లో భాగమైన దళితుల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆయన విమర్శించారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా, కందికట్కూరు మండల శివారులోని కిష్టారావు పల్లిలో ఇటీవల దారుణంగా హత్యకు గురైన తండ్రి కొడుకులు ఎల్లయ్య, శేఖర్ కుటుంబాలను ఆయన పరామర్శించారు.

వారి కుటుంబీకులను కలుసుకుని వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారిద్దరి హత్య కేసు నిందితులను ప్రభుత్వం వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడం కోసం ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన అప్పాయింట్మెంట్ లభించలేదని, అంతే కాదు ఇప్పటికి దాదాపు 10కి పైగా లేఖలు రాసినప్పటికే ఆయన నుండి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా దళితులు సరైన సమీక్షలు, సలహాలు లేక ఇబ్బందులపాలవుతున్నారని అన్నారు. అటువంటి వారి బాధను ప్రభుత్వమే అర్ధం చేసుకుని వారి బాధను తీర్చే ప్రయత్నం చేయాలనీ హితవు పలికారు. ఈ విషయమై కేసీఆర్ కు ఎన్నిసార్లు అప్పీలు చేసినప్పటికీ ఫలితం లేదని, కావున ఎవరైనా సరే రెండురోజుల్లో తనకు కేసీఆర్ అప్పాయింట్మెంట్ ఇప్పించగలిగితే వారికీ తాను అప్పుచేసి అయినా సరే ఒక కోటి రూపాయలు ఇస్తానని అన్నారు. కాబట్టి ఇకనైనా సీఎం గారు ప్రజల్లోకి వచ్చి దళితులను, వారి పరిస్థితులను తెలుసుకొని తగిన రీతిన న్యాయం చేయాలని అన్నారు…..