ఒక్క అవకాశం ఇస్తే మళ్లి ఆయన్నే సీఎంగా గెలిపించుకుంటారు : పోసాని కృష్ణమురళి

Sunday, May 27th, 2018, 01:20:19 PM IST

సినీ నటుడు, దర్శకుడు, రచయిత అయిన పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ తో కలిసి కాసేపు అడుగులేశారు. ప్రస్తుతం యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో సాగుతోంది. అక్కడకు విచ్చేసిన పోసాని, జగన్ తో క్షేమసమాచారం తెలుసుకుని తదనంతరం ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. కాసేపు ఉండి మండలం కాళ్ళ గ్రామంలో పాదయాత్ర చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, జగన్ గారితో కలిసి కేవలం రెండు కిలో మీటర్లు పాదయాత్ర చేయగానే నాకు అలసట వచ్చేసింది. మొహం మీద ఎండ పడుతోంది, దారిలో అక్కడక్కడా మట్టి, చిన్న రాళ్లు పడుతున్నాయి, అన్నిటికంటే ముందు ఈ మండుటెండల్లో నీరసం బాగా వస్తోంది.

కేవలం నేను రెండు కిలోమీటర్లే పాదయాత్ర చేయలేక ఇబ్బంది పడ్డాను అటువంటిది ఆయన తాను చేయదలచిన మూడువేల కిలోమీటర్లలో రెండువేల కిలోమీటర్లు అప్పుడే పూర్తిచేశారంటే ఆయన నిబద్ధతకు, ఓపికకు నా హాట్స్ ఆఫ్ అన్నారు. జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయమని నేను అనడం లేదు, ప్రజలకు ఖచ్చితంగా న్యాయంచేయాలని, ఎన్నో వ్యయప్రయాశలతో ఆయన ఈ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని అన్నారు. ఒక్కసారి ఏపీ ప్రజలు జగన్ కు కనుక అవకాశం ఇస్తే మళ్ళి మళ్ళి కూడా ఆయనకే తప్పక అవకాశం ఇచ్చి తీరుతారని, ఒకవేళ ఆయన అధికారంలోకి వచ్చాక సరైనరీతిలో పాలన చేయకపోతే నన్ను చెప్పుతో కొట్టండి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారం, పేరు కోసం ఈ పాదయాత్ర చేయడం లేదని, అధికారం వచ్చాక ప్రజలందరినీ సంతోషంతో సస్యశ్యామలంగా వుంచుతానని, అలానే వచ్చిన పదవితో నీతిగా నిజాయితీగా వారి నమ్మకాన్ని ఎన్నటికీ వొమ్ము చేయనని జగన్ చెప్పారని అన్నారు.

నిజానికి జగన్ తనకు బంధువు కాదు, అలానే తమ కులం వారు కాదు, తమ ఊరు వ్యక్తి అంతకన్నా కాదని, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే తలంపు వున్న గొప్ప వ్యక్తి అని, అందుకే తాను ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్లు పోసాని తెలిపారు. ఇప్పటికే ఇక్కడ అధికారంలో వున్న చంద్రబాబు రాష్ట్రాన్ని దొరికినంతగా దోచుకుంటున్నారని, ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలయిన డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, అలానే వ్యవసాయ రుణాలు పూర్తిగా రద్దు చేస్తాను అన్న ఆయన ఏ ఒక్కహామీ కూడా సరిగా నెరవేర్చలేదని విమర్శించారు. వైఎస్ మరణాంతరం ఆయన కాంగ్రెస్ ను వీడి సొంతగా పార్టీ నెలకొల్పినందువల్లే అప్పట్లో చంద్రబాబు, కాంగ్రెస్ తో కలిసి ఆయనను జైలు లో పెట్టించారని, కావున ప్రజలు ఈ సరి చంద్రబాబు చేసిన కుటిల రాజకీయాలను తప్పకుండ తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పోసాని విజ్ఞప్తి చేశారు…..

  •  
  •  
  •  
  •  

Comments