మోడీపై అంత విశ్వాసం ఉంటే, అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారో చెప్పాలి : చంద్రబాబు

Tuesday, March 13th, 2018, 02:03:32 AM IST

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం లో ఎన్డీయే ప్రభుత్వం తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైందని టిడిపి అధినేత, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. నేటి ఉదయం టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన కేంద్రంలో భాజపాకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారో వైకాపా అధినేత జగన్‌ చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్‌ చేశారు. వైకాపా బండారం బయటపెట్టాలని, ప్రజల్లో వాళ్ళ ముసుగు తొలగించాలని ఎంపీలకు, పార్టీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

ప్రధాని మోడీపై విశ్వాసం ఉందంటూ జాతీయ ఛానల్‌లో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మోదీపై అంత విశ్వాసం ఉంటే అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారని వైకాపాను చంద్రబాబు ప్రశ్నించారు. ఒకవైపు కేంద్రంపై విశ్వాసం ఉందని చెబుతూనే మరోవైపు అవిశ్వాసం పెడతామని అంటున్నారని… ఈ డొంక తిరుగుడు ఏమిటని వైకాపాపై ధ్వజమెత్తారు. విభజన చట్టం పూర్తిగా అమలు చేయాలని, పార్లమెంట్లో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ వైఖరి స్పష్టంగా వుందని, రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఉభయ సభల్లో ప్రస్తావించాలని, కేంద్ర మంత్రి పదవులకు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో అందరికీ వివరించాలని సుజనాచౌదరి , అశోక్ గజపతి రాజులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. నిధుల మంజూరుకు సులభ మార్గం ఉంటే క్లిష్టమార్గాలు ఎందుకు ఎంచుకుంటున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధనే మన లక్ష్యమని ఎంపీలతో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పార్లమెంట్ స్తంభింప చేస్తున్నాం, కేంద్రం నుంచి వైదొలిగాం, ఇంకా దశలవారీగా పోరాటం ఉద్ధృతం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు…

  •  
  •  
  •  
  •  

Comments