అరిస్తే సీఎం అవ్వను, ఓట్లు వేస్తే సీఎం అవుతాను : పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్

Sunday, May 20th, 2018, 11:50:43 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉదయం గంగమ్మ తల్లికి పూజ చేసి తన పోరాట యాత్రని ప్రారంభించారు. యాత్రలో భాగంగా నేడు ఇచ్చాపురం సభలో ప్రసంగించిన అయన చంద్రబాబు ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ అనుభవం చాలా ఎక్కువని, 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు మంచి అనుభవజ్ఞుడు ఉంటే విడిపోయి చాలా నష్టపోయిన రాష్ట్ర పాలన గాడిలో పడుతుందని అప్పట్లో ఆయనకు, ఆయన పార్టీకి మద్దతిచ్చానని అన్నారు. శ్రీకాకుళంలో ప్రజలు ఎన్నో కష్టనష్టాలతో అల్లాడుతున్నారని, ఇక్కడి గంగపుత్రులకు ప్రభుత్వం పరిహారం కింద ఇస్తామన్న డబులు కూడా ఇవ్వడంలేదని, వారి సమస్యలు విన్నపుడు గుండె తరుక్కుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై చంద్రబాబుతో మాట్లాడితే, నేను తప్పకుండ పరిష్కరిస్తాను అన్నారు. కానీ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఆయన చేసిందేమి లేదన్నారు. ఒకవేళ తాను టీడీపీ వారు ఏమి చేయడం లేదని విమర్శిస్తే తనపై, జనసేన నేతలపై దాడులకు దిగుతున్నారని, ఇటీవల ఒక జనసైనికుడిని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని, అతడు చనిపోతూ జై జనసేన అని నినాదాలు చేస్తూ మరణించాడని ఆయన అన్నారు.

పేరుకు హైదరాబాద్ లో పార్టీ ప్రకటన జరిగినప్పటికీ తనకు ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం వంటి ప్రాంతాల్లో పార్టీని మరింత ముందుకి నడిపి ఇక్కడి ప్రజలకు తన వల్ల అయిన సాయాం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. ఒక సాధారణ పార్టీ అధినేత స్థాయిలో అధికార పార్టీ చేసిన మోసాలు, అన్యాయాలపై తాను ఈ విధంగా పోరాడుతుంటే, అదే ప్రతిపక్షమైన వైసిపి అంతకన్నా ఎక్కువ పోరాటం చేయవచ్చని, కానీ వాళ్ళు అసలు అసెంబ్లీ కి రావడమే మానేశారని, ఇంక అలాంటపుడు ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబు మొదట ప్రత్యేక హోదా తెస్తామని, నన్ను నమ్మండి కేంద్రం మెడలు వంచి అయినా మన రాష్ట్రాన్ని, నూతన రాజధాని అభివృద్ధి చేద్దాం అని చెప్పారన్నారు. తరువాత మెల్లగా నెలలు గడిచాయని, అలా ఆరునెలలు, సంవత్సరం, రెండేళ్లు గడిచిపోయాయని అన్నారు. అప్పుడు అర్ధమయింది వీళ్ళు కేవలం ఓట్ల కోసం మాత్రమే హామీలు ఇస్తారు, చేతల్లో చేసేది ఏమి ఉండదని అన్నారు. ఆ తరువాత తాను హోదాపై పోరాటానికి దిగితే, వద్దు వద్దు దాని బదులు అంతకన్నా ఎక్కువ మన రాష్ట్రానికి లబ్ది చేకూరేలా ప్రత్యేక ప్యాకెజీ తెస్తున్నామని చంద్రబాబు చెప్పారు అని అన్నారు.

ప్రత్యేక ప్యాకేజి ప్రకటించినప్పుడు బిజెపి నేతలను ఎంతో ఘనంగా టీడీపీ వారు సన్మానించి, ఎంతో గౌరవంతో సత్కరించారని అన్నారు. దానివల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమాత్రం లేదని ఎద్దేవా చేసారు. తరువాత తాను జేఎఫ్సి పేరిట ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి దాదాపు డెబ్భైవేల కోట్లు నిధులు కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చాయని, వాటి లెక్కలు అడిగితే టీడీపీ వారు నీళ్లు నములుతూ మాట దాటవేస్తున్నారు అన్నారు. అంతేకాక నిజాలు మాట్లాడుతూ అడుగుతుంటే దౌర్జన్యం చేస్తున్న టీడీపీ కార్యకర్తల ఆటలు ఇకపై సాగవని, వారికి భయపడేది లేదని అన్నారు. నేను వెళ్లిన ప్రతి చోట అభిమానులు, కార్యకర్తలు నీరాజనాలు పడుతూ నన్ను పదే పదే సీఎం, సీఎం అని అరుస్తున్నారని, నిజానికి సీఎం కావాలంటే ఎంతో కష్టపడి ఉండాలని, ప్రజాసమస్యలపై అవగాహన, వాటిని తెలుసుకుని తీర్చగలిగే నేర్పు కోసమే తాను ప్రస్తుతం ప్రజల్లోకి పోరాట యాత్ర పేరుతో వెళ్తున్నట్లు తెలిపారు. ఇకపై సిఎం సీఎం అని అరవడం కాదు రానున్న ఎన్నికల్లో మన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మీరు మీ తల్లితండ్రులకు ఒక్కటే చెప్పండి. నీతి నిజాయితో వున్న పవన్ కళ్యాణ్ కు ఓటు వేయమని అన్నారు. లేదంటే అవినీతి, లంచగొండితనం నిండి ఓటుకి రెండు వేలు ఇచ్చే పార్టీ కి వోటు వేస్తారేమో అడగండి అని అన్నారు. తనకు పదవుల మీద అసలు ద్యాస లేదని, కేవలం ప్రజల కష్టాలు తెలుసుకుని తీర్చడానికే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు. ఇప్పటివరకు తనకు పోటీ చేసే అవకాశం రాలేదని, తనకి ఒక్క ఐదుగురు ఎమ్యెల్యేలని ఇచ్చినా చాలు వారితోనే తనవంతు న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా అయన తెలిపారు…….

  •  
  •  
  •  
  •  

Comments