డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే తల తీయించుకుంటా : పవన్ కళ్యాణ్

Tuesday, May 29th, 2018, 11:45:55 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ప్రజా పోరాట యాత్రలో భాగంగా 7వ రోజు శ్రీకాకుళం పాలకొండలో యాత్ర నిర్వహిస్తున్నారు. ఆయన అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను యాత్ర చేపట్టదలచింది ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను పూర్తిగా తెలుసుకోవడానికి అన్నారు. ఒక రాజకీయపార్టీ నేతకు ముందుగా ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నపుడే, రేపు వారికి ఒక ప్రణాళిక ప్రకారం ఏదైనా చేయడానికి వీలవుతుంది అని అన్నారు. అంతే కాదు తన యాత్ర శ్రీకాకుళం నుండి మొదలెట్టడానికి కారణం, శ్రీకాకుళం ఎందరో వీర జవానులకు పుట్టిల్లని, వెనుకబాటుతనంతో ఇక్కడి ప్రజలు అల్లల్లాడుతున్నారని అన్నారు. నేతలు, నాయకులు ఎందరో ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి, ఇక్కడి ప్రాంతాన్ని తమ అవసరాలకు వాడుకుని ప్రజా సంక్షేమం, అభివృద్ధి మాత్రం గాలికి వదిలేశారని అన్నారు.

తాను గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం చంద్రబాబు వంటి అనుభవం వున్న నేత అధికారం చేపడితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించానని అన్నారు. వారికి మద్దతు ఇచ్చిన సమయంలో ఎటువంటి డబ్బు, పదవులు వారి నుండి ఆశించలేదని, కేవలం ప్రజలకు మంచి చేయండి చాలు అని మాట మాత్రమే తీసుకున్నానని అన్నారు. అయితే తీరా ఎన్నికలు జరిగి టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి చూస్తే అప్ప్పుడే నాలుగేళ్లు గడిచాయని, మరి రాష్ట్రానికి ఏమి చేసారని చూస్తే శూన్యమని అర్ధమయిందని అన్నారు. రాష్ట్రం మొత్తం టీడీపీ నేతలు అందినంత దోచుకుతింటూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని అన్నారు. మొదట్లో ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు విషయమై నమ్మకంగా మాట్లాడిన బాబు, తరువాత హోదాని తొక్కిపెట్టారని మండిపడ్డారు. తరువాత నేను హోదా నినాదాన్ని మళ్లి లేవనెత్తితే, అవసరం లేదు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకెజీ వస్తోంది, అనుకున్న దానికంటే ఎక్కువ శాతం నిధులు వస్తాయని నమ్మించారన్నారు. అయితే అది పూర్తిగా దగా ప్యాకెజీ అని, రెండు పాచిపోయిన లడ్డూలు మన చేతికి ఇచ్చి అవి తినమన్నారని అన్నారు.

ఈ విషయమై నేను ప్రస్తుతం ప్రజల్లోకి వచ్చి ప్రశ్నిస్తుంటే నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని, అంతేకాక తాను యాత్ర చేస్తున్న ప్రాంతాల్లో కరెంటు తీయించడం, తమ గుండాలతో దాడి చేయించడం వంటివి చేస్తున్నారని మండి పడ్డారు. వారికి మద్దతిచ్చిన సమయంలో నేను వారికి మంచిగా కనపడ్డాను, ఇప్పుడు వారి తప్పులను ఎత్తి చూపుతుంటే నేను కేంద్ర బీజేపీ నుండి డబ్బు, ప్యాకెజీ తీసుకున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అసలు తనకు అటువంటి నీచ పరిస్థితి రాలేదు, రాదని, ఇకవేళ తాను డబ్బుకాని, ప్యాకెజి కానీ తీసుకున్నట్లు నిరూపిస్తే అందరిముందు తన తల నరుక్కోవడానికైనా సిద్దమేననని ఆయన స్పష్టం చేసారు. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా ఈ కుటిల టీడీపీ ప్రభుత్వ పాలనను పూర్తిగా గ్రహించి రానున్న ఎన్నికల్లో అటువంటి పార్టీలకు చరమాంకం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు…..

  •  
  •  
  •  
  •  

Comments