దర్శకుడు శంకర్ కు ఇళయరాజా నోటీసులు!

Saturday, January 3rd, 2015, 03:57:00 PM IST

ilaya-raja-shankar
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రఖ్యాత తమిళ దర్శకుడు శంకర్ కు లీగల్ నోటీసులను అందించారు. వివరాలలోకి వెళితే తాను స్వరపరచిన పాటను అనుమతిలేకుండా ‘కప్పాల్’ అనే తమిళ చిత్రంలో రీమిక్స్ చేసినందుకు గాను ఇళయరాజా, శంకర్ కు లీగల్ నోటీసులు పంపారు. కాగా 1989లో విడుదల అయిన ‘కరగాట్టకారన్’ చిత్రంలోని ‘ఒరు విట్టు, ఓరు వందు’ అనే పాటను శంకర్ సంస్థ ఎస్ పిక్చర్స్ లో నిర్మించిన చిత్రం ‘కప్పాల్’ లో రీమిక్స్ చేసి వాడుకోవడంపై ఆగ్రహంతో ఉన్న ఇళయరాజా, తన లాయర్ ఎస్ కే రఘునాధన్ ద్వారా లీగల్ నోటీసు పంపించారు.

అయితే దీనిపై ఎస్ పిక్చర్స్ సంస్థ స్పందిస్తూ ఆ పాట హక్కులను ‘ఆగి మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ నుండి తీసుకున్నట్లు తెలిపింది. కాగా దీనిపై రఘునాధన్ మాట్లాడుతూ ఆ పాటపై ఆగీ సంస్థకు ఎటువంటి యాజమాన్య, పబ్లిషింగ్ హక్కులు లేవని స్పష్టం చేశారు. ఇక తన అనుమతి లేకుండా పాటను వాడుకున్నందుకు గాను తగిన పరిహారం చెల్లించాలని, లేదా ఆ పాటను చిత్రం నుండి తొలగించాలని ఇళయరాజా డిమాండ్ చేస్తున్నారు.