నైజాంలో శాతకర్ణికి తలనొప్పిగా మారిన శతమానం భవతి !

Friday, January 20th, 2017, 11:55:00 AM IST

gouthami-putra-shatakarni-s
ఈ సంక్రాంతికి రిలీజైన మూడు చిత్రాలు మంచి టాక్ సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఖైదీ, శాతకర్ణి, శతమానంభవతి 1, 2, 3 స్థానాల్లో నిలబడి కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి. కానీ నైజాం ఏరియాలోనే ఈ లెక్కలు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. అదీ శాతకర్ణి విషయంలోనే. ఖైదీ చిత్రం ఇప్పటికే నైజాంలో రూ. 15 కోట్లకు పైగానే వసూలు చేసి సేఫ్ జోన్లోకి వెళ్లిపోగా శతమానంభవతి కూడా రూ. 5 కోట్ల పైనే వసూలు చేసి మంచి టాక్ తో నడుస్తూ లాంగ్ రన్లో ఇంకో రూ.2 కోట్ల వరకు రాబట్టేలా కనిపిస్తోంది.

కానీ నైజాంలో బాలకృష్ణకు అంతగా పట్టులేకపోవడం, మాస్ జనాలు ఎక్కువ శాతం ఖైదీ వైపుకు, కుటుంబ ప్రేక్షకులు ‘శతమానంభవతి’ వైపుకు మొగ్గు చూపుతుండటంతో శాతకర్ణి కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటిదాకా ఈ చిత్రం దాదాపు రూ. 7 కోట్లు కలెక్ట్ చేసినా అవి నెమ్మదిగా నిదానిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఖైదీ కన్నా శతమానంభవతి చూపుతున్న ప్రభావమనే చెప్పొచ్చు. ఎంతటి సినిమా అయినా కుటుంబ ప్రేక్షకుల ఆదరణ లేకపోతే కలెక్షన్లు రాబట్టడం కష్టం. ఇక్కడ ఆ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా శతమానంభవతికే ఓటేస్తుండటంతో శాతకర్ణి కాస్త వెనుకబడ్డట్టయింది. అంతేగాక ఇంకా కొన్ని ఏరియాల్లో శాతకర్ణి ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.