సముద్ర అలలకు కోపం వస్తోంది.. జాగ్రత్త!

Tuesday, April 24th, 2018, 10:05:26 PM IST

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఏ తరహాలో ఉందొ అందరికి తెలిసిందే. బయటకు అడుగుపెట్టాలంటే జనాలు భయంతో వణికిపోతున్నారు. ఏప్రిల్ నెలలోనే ఈ స్థాయిలో ఉందంటే వచ్చే నెల మేలో ఏ తరహాలో ఉంటుందో అని ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు. ఆ విషయాన్ని పక్కనపెడితే.. మరో వైపు సముద్ర తీరాల దగ్గర కూడా పరిస్థితి భయంకరంగా మారుతోంది. వాతావరణంలో ఊహించని మార్పుల కారణంగా అలలు ఆగ్రహాన్ని చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వేగంగా వీచే గాలులు సముద్రంలో మార్పులు చాలానే తెస్తున్నాయి. దీంతో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని సముద్ర తీర ప్రాంత వాసులకు సునామి హెచ్చరికల సంస్థ ( ఇన్ కాయిస్) సమాచారం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు – ఒడిశా అలాగే పశ్చిమ్‌బంగాల తీర ప్రాంతాల్లో అలల తాకిడి ఎక్కువగా ఉండవచ్చని సమాచారం అందుతోంది. సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇన్ కాయిస్ ద్వారా హెచ్చరికలు అందుతున్నాయి. అండమాన్ వైపు నుంచి భారత ప్రధాన భూభాగం తీరం వైపునకు అలలు దాదాపు 3-4 మీటర్ల ఎత్తులో ఎటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే కేరళలో లోతట్టు ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు అలల కారణంగా దెబ్బ తిన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని గ్రామాలకు కూడా సముద్ర అలల నుంచి ముప్పు ఉందని తెలియడంతో అధికారులు అప్రమత్తయ్యారు. మత్య్సకారులెవరు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీచేశారు. సముద్ర తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments