స్టంపింగ్ లో ధోనీని కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు మామ..!

Tuesday, October 30th, 2018, 03:45:27 PM IST


ప్రస్తుతం భారత్ మరియు వెస్టిండీస్ జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచులు ఒక ఎత్తైతే నిన్న జరిగినటువంటి నాలుగో మ్యాచు మరో ఎత్తు.భారత్ జట్టు ఆటగాళ్ల ధాటికి విండీస్ 153 పరుగులకే చేతులెత్తేశారు.ముందు మూడు మ్యాచులు ఇరు జట్ల మధ్య రసవత్తరంగా సాగినా నిన్నటి మ్యాచ్ మాత్రం వార్ వన్ సైడ్ అయ్యిపోయింది.ముందు మూడు మ్యాచుల్లో కోహ్లీ వరుస శతకాలతో రెచ్చిపోగా నిన్న మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.అయితేనేం మిగతా ఆటగాళ్లు రోహిత్ మరియు అంబటి రాయుడులు సెంచరీలతో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

వీటితో పాటు క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ తో విఫలం అవుతున్నా సరే స్టంపింగ్ లలో తనకి మరెవరు సాటి రారు అని మళ్ళీ నిరూపించుకున్నారు.నిన్న జరిగిన మ్యాచ్ 24 వ ఓవర్లో మెరుపు వేగంతో స్టంప్ చేసి జట్టు మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు.ఇప్పటికే స్టంపింగ్స్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన ధోని నిన్న ఒక సెకను పూర్తయ్యే లోపే 0.08 సెకెన్లలోనే స్టంప్ చేసి మరో రికార్డు సృష్టించాడు.జడేజా వేసిన ఓవర్ లో ఏం జరిగిందో జడేజాకే అర్ధం కాలేదు,ఇది అవుటా ధోనీని అడగగా ధోని ఒక్క నవ్వు నవ్వాడు కట్ చేస్తే థర్డ్ అంపైర్ దాన్ని అవుట్ గా ప్రకటించారు.దీనితో స్టంపింగ్ లో ధోనీని కొట్టే మరో ఆటగాడు ఇక ఎవరు ఉండరని అభిమానులు సంబరం చేసుకుంటున్నారు.