ఫైనల్ కు దూసుకుపోయిన భారత్

Saturday, August 31st, 2013, 04:14:51 PM IST

hocky

ఆసియా కప్ హకీలో భారత్ ఫైనల్స్ కు చేరుకుంది. అంతే కాదు.. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ కు కూడా భారత జట్టు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్-దక్షిణకొరియా జట్లు తలపడనున్నాయి.

శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో భారత్ 2-0 గోల్స్ తేడాతో మలేసియాను ఓడించింది. డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా 2-1తో పాకిస్థాన్‌పై గెలిచింది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది. కొరియా జట్టు ఇప్పటికే ప్రపంచ కప్‌కు అర్హత పొందడం… అడ్డుగా ఉన్న పాకిస్థాన్ సెమీఫైనల్లోనే ఓడిపోవడంతో భారత్, మలేసియా జట్లకు మార్గం సుగమమైంది. ఈ రెండు జట్లూ వచ్చే ఏడాది నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ కప్ బెర్త్‌లను దక్కించుకున్నాయి. 1971లో ప్రపంచ కప్ మొదలయ్యాక ఈ మెగా ఈవెంట్‌కు పాకిస్తాన్ అర్హత పొందలేకపోవడం ఇదే ప్రథమం.

సెమీఫైనల్లో పాక్ ఓడిపోవడంతో ప్రపంచ కప్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్.. ఆతిథ్య మలేసియా జట్టును ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా పకడ్బందీ వ్యూహంతో ఆడింది. సమన్వయంతో కదులుతూ అవకాశం చిక్కినప్పుడల్లా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పైకి దాడులు చేసింది. ఈ క్రమంలో ఆట 8వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రఘునాథ్ గోల్‌గా మలిచాడు. విరామ సమయానికి భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ద్వితీయార్ధంలోనూ భారత్ పట్టుదలతో పోరాడింది. ఆట 60వ నిమిషంలో రమణ్‌దీప్ అందించిన పాస్‌ను మన్‌దీప్ సింగ్ లక్ష్యానికి చేర్చడంతో భారత ఆధిక్యం 2-0కు పెరగడంతోపాటు విజయమూ ఖాయమైంది.