భయంకర సఫారీ గడ్డపై ఇండియాకు తొలి విజయం!

Wednesday, February 14th, 2018, 12:49:35 PM IST

క్రికెట్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా గడ్డపై అక్కడి టీమ్ తో ఇతర దేశాలు తలపెడితే గెలుపొందడం చాలా కష్టం. అక్కడి గ్రౌండ్ లకు బాగా అలవాటుపడిపోయిన సఫారీలు వారి సొంత గడ్డపై ఎలాంటి జట్టుతో ఆడినా గట్టి పోటీని ఇవ్వగలరు. ఇండియన్ టీమ్ గత కొన్నేళ్లుగా విదేశీ టూర్లలో మంచి విజయాలను అందుకుంది. ప్రతి గడ్డపై మన జట్టుకు ఒక రికార్డ్ ఉంది. సౌత్ ఆఫ్రికాలో గత 30 ఏళ్లుగా పర్యటిస్తున్నప్పటికీ ఒక్క విజయం లేదు. ఏడూ వన్డేల సిరీస్ లను భారత జట్టు అక్కడ ఆడింది. కానీ ఒక్క సిరీస్ దక్కలేదు.

అయితే ఫైనల్ గా విరాట్ కోహ్లీ సేన ఆ అపజయాలకు చెక్ పెట్టింది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయామని కసితో ఉన్న విరాట్ సేన ఎట్టకేలకు గెలిచి సౌత్ ఆఫ్రికా లో తొలి సిరీస్ ను అందుకుంది. ఆరు వన్డేల సిరీస్ లో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 4-1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. రోహిత్‌ శర్మ (115; 126 బంతుల్లో 11×4, 4×6) సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా భారత్‌ 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు సాధించింది. కానీ సౌత్ ఆఫ్రికా మాత్రం 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. హషీమ్‌ ఆమ్లా ఒక్కడు 71 (92) పరుగులు చేసి పోరాడినా దక్షిణాఫ్రికాకు విజయం దక్కలేదు. పాండ్య (2/30), చాహల్‌ (2/43), కుల్‌దీప్‌ (4/57) బౌలింగ్ తో మంచి ప్రతిభని కనబరిచారు.