ధోనీ టీమ్‌కు కళ్లుచెదిరే నజరానా..!

Tuesday, June 25th, 2013, 01:50:25 AM IST


ఉరిమే ఉత్సాహంతో ఉన్న టీమిండియాకు ఇప్పుడు కళ్లు చెదిరే గిఫ్టులు అందుతున్నాయి. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ గెల్చుకున్న టీమిండియాకు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) భారీ నజరానా అందిస్తోంది. జట్టులోని ప్రతి సభ్యుడికి కోటి రూపాయల నగదు బహుమతిగా ఇవ్వనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. టీమ్‌తో కలిసి పనిచేసిన సహాయ సిబ్బందికి 30 లక్షల రూపాయల చొప్పున నజరానా ప్రకటించింది. టీంఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని బీసీసీఐ ప్రత్యేకంగా అభినందించింది.

మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ను ఓడించి చాంపియన్స్ ట్రోఫీని కైవశం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మొదట్నంచి దుమ్మురేపుతూ వచ్చింది ధోనీ గ్యాంగ్.. ఫైనల్లోనూ ఛాంపియన్స్ లా చెలరేగి ఆడారు. ట్వంటీ ఓవర్స్ కు కుదించిన మ్యాచ్ లో టీంఇండియన్స్ అదరగొట్టారు. ఇంగ్లండ్ పై గెలవగానే టీంఇండియన్స్ సంబరాలు అంబరాన్నంటాయి.

భారత్ ఈ టైటిల్ ను గెల్చుకోవడం ఇదీ రెండోసారి. 2002లో ఇండియా, శ్రీలంక సంయుక్తంగా దీన్ని సొంతం చేసుకున్నాయి. అప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో సంయుక్త విజేతలుగా ప్రకటించారు.