ఇంగ్లండ్ కు ఆ సత్తా ఉందా?

Saturday, June 22nd, 2013, 02:11:42 PM IST


ఛాంపియన్స్ ట్రోఫీలో లాస్ట్ ఫైట్ కు గ్రౌండ్ వర్క్ మొదలైంది. ఇంగ్లండ్ , టీమిండియాల మధ్య ఈనెల 23న బర్మింగ్ హామ్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టెర్ కుక్ మాత్రం ట్రోఫీ గెలుస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. దీనికి చాలా రీజన్లున్నాయి. .సొంతగడ్డపై ఆడుతుండడం ఇంగ్లండ్ కు అడ్వాంటేజ్ గా మారింది. మరోవైపు అక్కడి కండీషన్స్ , గ్రౌండ్ , పిచ్ ఇలాంటివన్నింటిపై ఇంగ్లండ్ కు అవగాహన ఉంది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వరుసగా రెండు టోర్నమెంట్లను ఇంగ్లండ్ లోనే ఆడింది.

ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. కెప్టెన్ కుక్, ట్రాట్, రూట్ లు సూపర్ టచ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లో అండర్సన్, ఫిన్, బ్రాడ్, ట్రెడ్ వెల్ లు రాణిస్తున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ జరగబోయే బర్మింగ్ హామ్ వేదికపై కూడా ఇంగ్లండ్ బౌలర్లు గతంలో రాణించారు. దీంతో టీమిండియాపై గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నాడు ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ .

ఎవరి నమ్మకం వారిది.. ఇంగ్లండ్ జట్టు బలమైన జట్టే.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. వరుస విజయాలతో దూసుకొస్తున్న ధోనీ సేనకు అడ్డుకట్ట వేయడం సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫాంలో ఉన్నారు. ఇంగ్లండ్ పిచ్ లపై ఏ జట్టు ఆటగాళ్లు భారీ స్కోర్లు చేయలేకపోయారు.. అలాంటి పిచ్ లపై భారత బ్యాట్స్ మెన్లు ఇప్పటికే పరుగుల వరద పారించారు. బౌలర్లు కూడా ఏ మాత్రం భారీ స్కోర్లు సమర్పించుకోవడం లేదు. కండీషన్స్ కు తగ్గట్టుగా బౌలింగ్ వేస్తున్నారు.

జట్టును ముందుండి నడిపించడంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డిస్టింక్షన్ లో పాసయ్యాడు. మహామహా టీంలైన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ , శ్రీలంకలనే మట్టికరిపించారు. అలాంటిది ఇంగ్లండ్ భరతం పట్టడం ధోనీ సేనకు మంచీనీళ్ల ప్రాయమే. ఇంత స్ట్రాటెజీ చూస్తున్నప్పటికీ ఇంగ్లండ్ గెలుపు పై ఆశలు పెట్టుకుందా అంటున్నారు క్రికెట్ లవర్స్.. ఆశకు కూడా హద్దుండాలి భయ్యా అంటూ ఇంగ్లండ్ కెప్టెన్ పై సెటైర్లేసుకుంటున్నారు.