లంకతో సెమీతుమీకి సిద్ధమైన భారత్

Thursday, June 20th, 2013, 11:41:19 AM IST

ఉత్కంఠ రేపుతున్న శ్రీలంక, భారత్ ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభం అవుతోంది. గెలుపుపై ఇరుజట్లు ధీమాగా ఉన్నాయి. వర్షం ఎక్కడ అడ్డుతగులుతుందో అని ఇరుజట్లలో కాసింత కంగారు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ చేరాలని టీమిండియా, శ్రీలంక జట్లు తహతహలాడుతున్నాయి..

ఎవరి బలం ఎంత?

క్రాడిఫ్ లో మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఇరుజట్ల బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. కీలక మ్యాచుల్లో స్టార్ ఆటగాళ్లు టచ్ లోకి రావడం లంకకు కలిసొచ్చే అంశం. లంక ఆడిన చివరి లీగ్ మ్యాచ్ లో జయవర్ధనే ఫాంలోకి రాగా.. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో సంగక్కర సెంచరీ చేశాడు. ఇక భారత్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో దిల్షాన్ , పెరీరాలు అదరగొట్టారు. దీంతో శ్రీలంక తమ టాపార్డర్ పై నమ్మకం పెట్టుకుంది.

ఇక టీమిండియా అన్ని విభాగాల్లో పర్ ఫెక్ట్ గా కనిపిస్తోంది. ఓపెనర్లు ధావన్, రోహిత్ శర్మలు అద్భుతమైన ఫాంలో ఉన్నారు. శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో శతకాలు బాదిన విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ లు…మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సిరీస్ లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయిన సురేశ్ రైనా తన బ్యాట్ కు పనిచేప్పేందుకు కసరత్తు చేశాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఛాన్స్ దొరికితే మ్యాచ్ ను ఫినిష్ చేసేదాకా వదలడు. ఈ విషయం లంక జట్టుకు కూడా తెలుసు. దీంతో టీమిండియా బ్యాట్స్ మెన్లను కట్టడి చేసేందుకు శ్రీలంక వ్యూహరచన చేస్తోంది.

మ్యాచ్ సమీకరణాలు ఎలా ఉన్నా శ్రీలంకను వర్షం కలవరపెడుతోంది. వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలిపింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే.. టీమిండియానే విజేతగా ప్రకటిస్తారు. ఎందుకంటే ఇండియా గ్రూప్ బీలో అత్యధిక పాయింట్లు, అత్యధిక రన్ రేట్ సాధించింది. దీంతో వర్షం పడకుండా ఉండాలని లంక జట్టు కోరుకుంటోంది. మరోవైపు టీమిండియా కూడా పూర్తి మ్యాచ్ జరిగితేనే అసలైన మజా ఉంటుందని భావిస్తోంది.