భారత్ జోరు కొనసాగేనా..

Friday, July 26th, 2013, 12:47:59 PM IST

cricket

తొలి వన్డేలో సునాయాస విజయంతో సిరీస్‌లో బోణీ కొట్టిన యువ భారత్ మరో సమరానికి సిద్ధమవుతోంది.ఆతిథ్య జింబాబ్వేతో జరుగుతున్న సెల్‌కాన్ మొబైల్ కప్ ఐదు మ్యాచ్‌ల సి రీస్‌లో రెండో వన్డేకు రెడీ అయింది.ఈరోజు జరిగే ఈ మ్యాచ్‌కు తొలి వన్డే జరిగిన ఇక్కడి హరారె స్పోర్ట్స్ క్లబ్ వేదిక. ఆరంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీకి తోడు, అరంగేట్రం హీరో అంబటి రాయుడు అజేయ అర్ధ శతకంతో సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరోసారి అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. అయితే తొలి వన్డేలో భారత్ ఏకపక్ష విజయం సాధిస్తుందనుకుంటే జింబాబ్వే పోరాడడంతో కొద్దిగా చెమటోడ్చాల్సి వచ్చింది.కానీ ఈ సారి ఆ చాన్స్ ఇవ్వకుండా సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలవాలని భారత్ భావిస్తోంది.మరోవైపు ప్రారంభ మ్యాచ్‌లో ఓటమిపాలైన జింబాబ్వే ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి పోటీలో నిలవాలని చూస్తోంది.అందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమవుతోంది.తొలి మ్యాచ్‌లో మరీ పేలవ ప్రదర్శన కాకుండా 200 పరుగులకు పైగా సాధించిన జింబాబ్వే మరింత మెరుగ్గా ఆడాలని భావిస్తోంది. సికందర్, చిగుంబురా చూపించిన తెగువ, ఓపికను మిగతా ఆటగాళ్లు కూడా చూపితే 250 దాకా స్కోరును సాధించి భారత్‌కు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంటుంది.అలాగే సిబందా, మసకద్జా, బ్రెండన్ టేలర్ తమ స్థాయి ఆటతీరును చూపాల్సి ఉంది. అయితే బౌలింగ్ విభాగం మాత్రం పటిష్ట భారత లైనప్‌ను కట్టడి చేయడం తలకు మించిన భారమే. ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న కోహ్లి జోరును అడ్డుకునేందుకు వారు చెమటోడ్చాల్సిందే. ధావన్ మెరుపులు కూడా తోడైతే వీరికి కష్టకాలమే. ఉత్సేయ మాత్రమే తన పది ఓవర్లలో రెండు వికెట్లు తీయగలిగాడు. సొంత మైదానంలో ఆడే వెసులుబాటు ఉండడంతో ఇక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని బోణీ చేయాలని జింబాబ్వే పట్టుదలతో ఉంది.