మహిళల టీ20 ప్రపంచకప్‌.. టీమ్ ఇండియా జైత్ర‌యాత్ర..!

Saturday, November 17th, 2018, 09:20:38 AM IST

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా అమ్మాయిలు అద‌ర‌గొడుతున్నారు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచ్ నుండే జోరు కొన‌సాగిస్తున్న టీమ్ ఇండియా మ‌హిళ‌లు, హ్యాట్రిక్ విజ‌యాల‌తో సైమీస్ బెర్తు ఖాయం చేసుకుని.. గ్రూప్ -బిలో ఆస్ట్రేలియాతో ఆఖ‌రి పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఇప్ప‌టికే కంగారూలు కూడా సెమీస్ బెర్తు ఖాయం చేసుకోవ‌డంతో, వారిని ఓడించ‌డం అంత సుల‌భం కాదు. మ‌రి ఈ నామ మాత్ర‌పు మ్యాచ్‌లో హ‌ర్మ‌న్ ప్రీత్ సార‌ధ్యంలోని భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఆసీస్‌ను ఎలా ఎదుర్కొంటుందో ఆని స‌ర్వ‌త్రా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భార‌త్ జైత్ర యాత్ర పై ఓ లుక్ వేస్తే.. తొలి మ్యాచ్‌లోనే బ‌ల‌మైన న్యూజిలాండ్‌ను ఓడించి ఘ‌నంగా స్టార్ట్ చేసింది టీమ్ ఇండియా. మహిళల టీ20ల్లో సెంచరీ చేసిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిన హర్మన్‌ (103) సెంచ‌రీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి 34 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

ఇక ఆ త‌ర్వాత రెండో మ్యాచ్‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి అయిన పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించారు మ‌న టీమ్ఇండియా మ‌హిళ‌లు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత అమ్మాయిలు టి20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయం సాధించారు. మొదట బంతితో కట్టడి చేసి… ఆ తర్వాత బ్యాట్‌తో చితక్కొట్టి… గత ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది.

ఆ త‌ర్వాత ఐర్లాండ్‌తో జ‌రిగిన మూడో మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలింగ్‌ నుంచి ప్రతిఘటన ఎదురైనా… బ్యాటింగ్‌లో మోస్తరు స్కోరే చేయగలిగినా… పట్టు విడవని భారత అమ్మాయిలు హ్యాట్రిక్ విజ‌యంతో సెమీస్‌లోకి దూసుకెళ్ళారు. మిథాలీ రాజ్‌ స్థిరమైన ఇన్నింగ్స్‌కు… రాధ యాదవ్, దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌ స్పిన్‌ మాయ తోడవడంతో 52 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ప్రపంచకప్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది.

మ‌రి గ్రూప్‌లో టాప‌ర్‌గా నిలవాల‌ని భావిస్తున్న టీమ్ ఇండియా ఆస్ట్రేలియాను ఓడించి ఆత్మ‌విశ్వాసంతో సెమీ ఫైన‌ల్‌కి సిద్ధ‌మ‌వ్వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. మ‌రి మ‌న టీమ్ ఇండియా మెన్స్‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఇలాగే మ‌న భార‌త మ‌హిళ‌లు జైత్ర‌యాత్ర కొన‌సాగించాల‌ని యావ‌త్ భార‌త‌దేశం ఆశిస్తోంది.