జైత్రయాత్రకు బ్రేక్ ఎందుకు పడింది?

Thursday, July 4th, 2013, 05:23:02 PM IST


అద్భుతంగా సాగిన టీమిండియా జైత్రయాత్రకు సడన్ బ్రేక్ ఎందుకు పడింది? ఆకాశానికెగసిన ప్రతిభ ఎందుకు అధ:పాతాళానికి పడిపోయింది? వారం రోజులకే ఆటగాళ్లు ఫాం కోల్పాయారా? ఉరిమే ఉత్సాహం కనుమరుగవనుందా? విండీస్ లో భారత జట్టు ప్రదర్శన చూసిన వాళ్లలో ఇవే ప్రశ్నలు మెదులుతున్నాయి.

2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత జట్టు ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగా ఆడింది. ఆస్ట్రేలియా వంటి మేటి జట్టును మట్టికరిపించిన టీమిండియా.. ఆ తర్వాత ఓ రేంజ్ లో ఎదిగిపోయింది. చిన్నా పెద్దా జట్ల తేడా లేదు. వేదిక ఏదైనా బెంగేలేదు. అన్నింటికీ విజయమే సమాధానమైంది. వన్డేల ఉనికి ప్రశ్నార్థకమవుతున్న వేళ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచారు. వన్డేలు ఇలా ఆడాలి అని మిగతా దేశాలకు రుచి చూపించారు. రీసెంట్ గా స్వదేశంలో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించారు. టెస్టుల్లో 4-౦తో గెలిచిన కంగారూలపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు అరుదైన రికార్టులు కూడా సొంతం చేసుకున్నారు.

ఇంగ్లండ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతలుగా నిలిచి భారత జట్టు దర్పమేమిటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ టోర్నీలో మిగతా జట్లు తేలిపోయిన వేళ మనోళ్లు అన్ని విభాగాల్లోనూ విజృంభించారు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక వంటి మేటి జట్లను ఊదిపారేశారు. ఫైనల్లో హోం సైడ్ ఇంగ్లండ్ కు ముచ్చెమటలు పట్టించి ఛాంపియన్లుగా నిలిచారు.

సీన్ రివర్స్..
ఇక్కడి వరకు సీన్ ఓకే.. కట్ చేస్తే అంతా రివర్స్ అయింది. కరేబియన్ గడ్డపై జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో అత్యంత చెత్తగా ఆడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టు ఇదేనా అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయినా కాస్త పోరాటం చూపించారులే అనుకున్నాం.. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మరీ దారుణంగా ఆడారు. కెన్యా, జింబాంబ్వే వంటి జట్ల మాదిరిగా ఆడి అపకీర్తి మూటగట్టుకున్నారు.