ట్రై సిరీస్ ఫైనల్: ఎవరి బలం ఎంత?

Thursday, July 11th, 2013, 01:06:31 PM IST


భారత్-శ్రీలంక జట్లు మరో కీలక పోరులోకి దూకుతున్నాయి. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో ఇవాళ రాత్రి జరగనున్న ట్రై సిరీస్ ఫైనల్స్ లో సత్తా చాటేందుకు టీమిండియా తహతహలాడుతోంది. గాయం నుంచి కోలుకోవడంతో కెప్టెన్ ధోనీ ఫైనల్ మ్యాచ్ లో సారధ్యం వహించనుండడం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఏ విధంగా చూసినా.. టీమిండియానే పటిష్టంగా ఉండటంతో.. ఈసారీ గెలుపు భారత్ దే అని విశ్లేషకులు అంచనా వేస్తుండగా.. మొన్నటి మ్యాచ్ కి బద్లా తీర్చుకోవడానికి లంకేయులు సిద్ధమయ్యారు.

మంగళవారం నాడు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టుపై భారత్ ఘన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్ళిన విషయం తెలిసిందే. ప్రారంభ మ్యాచ్‌లలో ఓటముల ద్వారా అందరినీ నిరుత్సాహ పరచిన టీమిండియా.. ఆ తర్వాతి మ్యాచ్‌లలో ఘన విజయాలతో సత్తా చాటింది. అయినాకానీ రెండు బోనస్ ఊతంతో భారత జట్టు ఫైనల్ చేరింది.

ట్రై సిరీస్ ప్రారంభ మ్యాచ్ లో విండీస్ చేతిలో ఘోర పరాజయం అనంతరం గాయం కారణంగా ధోనీ తప్పుకున్నాడు. ఈ దశలో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి విరాట్ కోహ్లీ.. జట్టును వీరోచితంగా మందుకు నడిపించాడు. రైజ్ టు ది అకేషన్ అన్న రీతిలో సాగిన కోహ్లీ సారథ్యం పలువురి ప్రశంసలు అందుకుంది.

మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఆడిన జట్టు యథాతథంగా మ్యాచ్ లో ఆడనుంది. అయితే.. గాయం నుంచి పూర్తి గా కోలుకున్న ధోనీ జట్టులో చేరితే… మురళీ విజయ్ పేరు ఫైనల్ జట్టులో ఉండకపోవచ్చు. బౌలింగ్ లో సత్తా చాటుతున్న యువ సీమర్ భువనేశ్వర్ కుమార్ ఫైనల్ లో కూడా సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. ఉమేశ్, ఇషాంత్‌లు కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ఆల్‌రౌండర్‌గా జడేజా పూర్తి స్థాయిలో తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత్‌నుంచి మరో మెరుగైన ప్రదర్శనను ఆశించవచ్చు.

మరోవైపు ట్రోఫీని గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న శ్రీలంక జట్టు జయవర్ధనే. కుమార్ సంగాక్కరపైనే ప్రధానంగా ఆధారపడుతోంది. చోటు కల్పించే అవకాశం ఉంది. గతంలో భారత్ తో జరిగిన అనేక మ్యాచ్ లలో వీరిద్దరూ తమ సత్తాను ప్రదర్శించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అయితే.. కీలక మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోవడం.. శ్రీలంక జట్టు సభ్యులను బాగా కుంగదీస్తోంది. అటు బౌలింగ్ లో కూడా శ్రీలంక పరిస్థితి పెద్ద గొప్పగా లేదు. ఈ నేపథ్యంలో.. ట్రైసిరీస్ ట్రోఫీని భారత్ గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.