హైదరాబాద్ పంపకాల్లో తేడా వస్తే అంతే !

Sunday, September 23rd, 2018, 04:23:21 PM IST

తెలంగాణ మహాకూటమిలో సీట్ల పంపకం మరీ జఠిలంగా మారిపోయింది. కాంగ్రెస్, టీడీపీలు ఎవరికి వారు గెలిచే స్థానాలనే కేటాయించమని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సీట్ల విషయంలో ఎవరూ తగ్గడం లేదు. ఇక్కడ టీడీపీ ఇంతకు ముందు తాము గెలిచిన స్థానాలను, తమ మద్దతుతో బీజీపీ గెలిచిన స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదంటోంది.

ఇక కాంగ్రెస్ కూడ ఆ నియోజకవర్గాల్లోనే ఉన్న సీనియర్ నాయకులకు ఖచ్చితంగా సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని పట్టు బడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, ఘోషా మహల్, పఠాన్ చెరు, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ముషీరాబాద్ ఇలా 12 స్థానాలను టీడీపీ అడుగుతుండగా వాటి కొన్నింటిలో మర్రిశశిధర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ముఖేష్ గౌడ్, సుధీర్ రెడ్డి, భిక్షపతి యాదవ్ లాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు.

వీరందరికీ సీట్లు తప్పకుండా ఇవ్వాలని, లేకుంటే రాజకీయ భవిష్యత్తులు గందరగోళంలో పడతాయని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా కూటమిలోని రెండు పెద్ద పార్టీలు సీట్ల కోసం ఒంటి కాలు మీద నిల్చుని ఉండటంతో ఒకరికిచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ఎక్కడ కూటమి బీటలువారుతుందోనని కాంగ్రెస్ అధిష్టానం తల పట్టుకుని కూర్చుంది.