వైఎస్ జగన్ కొంప ముంచిన సర్వేలు !

Wednesday, September 19th, 2018, 10:41:26 AM IST

ఎలక్షన్స్ వస్తున్నాయంటే పార్టీలన్నీ తమకున్న గెలుపు అవకాశాల్ని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఎవరికివారు అంతర్గత సర్వేలను నిర్వహించుకుంటుంటాయి. ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక, వాళ్లకు నియోజకవర్గాల కేటాయింపులు, ప్రచార కార్యక్రమాల్ని ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ రకంగా సర్వేలు పార్టీలకు ఎంతో కొంత మేలును తప్పకుండా చేస్తాయి.

కానీ వైకాపా అధినేత వైఎస్ జగన్ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. వైకాపా చేసిన అంతర్గత సర్వేల ఫలితాల ఆధారంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన కొంప ముంచుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా పార్టీల్లో తిరుగుబాట్లకు కారణమవుతున్నాయి. అందుకు నిదర్శనమే వంగవీటి రాధా, విజ్ఞాన్ రత్తయ్యల అలకలు.

ముందుగా రాధాకు విజయవాడ సెంట్రల్ స్థానాన్ని ఇవ్వాలనుకున్నారు జగన్. కానీ వాళ్ళ సర్వేల్లో సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్నందున ఆ స్థానాన్ని వారికే ఇచ్చేస్తే బాగుంటుందని, రాధాను కాపు ప్రాభల్యం ఎక్కువగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో బరిలోకి దింపితే మంచిదని తేలిందట. దీంతో జగన్ ఒక్కసారిగా రాధాకు సెంట్రల్ టికెట్టు ఇవ్వడం కుదరదని, చేస్తే తూర్పు అసెంబ్లీ స్థానానికి లేదా మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయమని అల్టిమేటం జారీ చేశారు. కానీ ఇన్నాళ్లు సెంట్రల్ సీటును దృష్టిలో పెట్టుకుని చేసిన గ్రౌండ్ వర్క్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుందని, తనకు ఆ సీటే కావాలని రాధా పట్టుబట్టుకుని కూర్చోవడంతో విజయవాడ కేటాయింపు సమస్యాత్మకంగా మారింది.

అలాగే గుంటూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి చేసిన సర్వేల ఫలితంగా గత ఎన్నికల ముందు నుండి ఆ సీటును ఆశిస్తున్న విజ్ఞాన్ రత్తయ్య కుటుంబానికి ఆశాభంగం కలిగింది. వైఎస్ జగన్ ఆ స్థానాన్ని కాపు కమ్యూనిటీకి చెందిన కిలారు రోశయ్యకు కేటాయించాలని, రత్తయ్య కుమారుడు కృష్ణదేవరాయలును నరసరావుపేటకు మార్చాలని నిర్ణయించారు. రత్తయ్య కుటుంబం, అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. ఇలా రెండు ప్రధాన స్థానాల్లో చేసిన సర్వేలు పార్టీలో తిరుగుబాటుకు కారణమవడంతో జగన్ కు తలనొప్పి మొదలైంది.