ఐపీఎల్ లో అట్టర్ ఫ్లాప్ ఆటగాళ్లు.. కోట్లు పెట్టి కొంటె ముంచేశారు!

Tuesday, May 29th, 2018, 02:05:39 AM IST

ఐపీఎల్ లో ఈ ఏడాది సరికొత్తగా సాగింది. కొత్తగా వచ్చిన ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. గతంలో రికార్డులు బాదిన ఆటగాళ్లే ఈ సారి కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. హైదరాబాద్ – చెన్నై ఫైనల్ మ్యాచ్ వరకు దాదాపు అన్ని మ్యాచ్ లు మంచి ఆసక్తిని రేపాయి. చివరి నిమిషం వరకు ఎవరు గెలుస్తారో ఓడిపోతారో అనే మ్యాచ్ లు ఈ ఏడాది ఎక్కువగా నమోదయ్యాయి. ఇకపోతే ప్రాంచైజీలు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు వారి ఆశలని ఆవిరి చేశారు. ముఖ్యంగా ఐదుగురు ఆటగాళ్లు ఒంటి చేత్తో గెలిపిస్తారు అని అనుకున్నప్పటికీ కొంచెం కూడా జట్ల కోసం పోరాడలేదు.

బెన్ స్టోక్స్ – రాజస్థాన్ రాయల్స్ :

ఐపీఎల్లో ఈ ఏడాది అత్యధిక ధరను పలికిన ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ ముందున్నాడని చెప్పాలి. అప్పుడెప్పుడో మొదటి సీజన్ లో ఐపీఎల్ ట్రోపిని గెలుచుకున్న రాజస్థాన్ ఈ సారి ఎలాగైనా నెగ్గాలని 12.5 కోట్లను కుమ్మరించి బెన్ స్ట్రోక్స్ ను వేలంలో దక్కించుకుంది. వరల్డ్ క్రికెట్ హిస్టరీలో అత్యంత ప్రమాదకరమైన ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన స్ట్రోక్స్ రాజస్థాన్ కి మాత్రం పెద్ద దెబ్బె కొట్టాడు. ఈ ఏడాది 196 పరుగులు చేసి కేవలం 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

మనీష్ పాండే – హైదరాబాద్ సన్ రైజర్స్ :

హైదరాబాద్ యాజమాన్యం ఈ సారి మనీష్ పాండేపై చాలా స్పెషల్ గా కన్నేసిందనే చెప్పాలి. మ్యాచ్ ను మలుపు తిప్పగల యువ ఆటగాడిగా మనీష్ కి మంచి పేరుంది. అందుకే 11.5 కోట్లు వెచ్చించి ఎస్ఆర్ హెచ్ అతన్ని గెలుచుకుంది. కానీ మనీష్ మాత్రం జట్టు కోసం కాకుండా ప్రత్యర్థి జట్టు విజయం
కోసమే ఎక్కువ కష్టపడ్డాడు అని సోషల్ మీడియాలో సెటైర్స్ బాగానే వచ్చాయి. ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లలో తప్పితే మనీష్ ఎక్కడా పెద్దగా రాణించలేదు. మనీష్ ఈ సీజన్ లో 284 పరుగులు మాత్రమే చేశాడు.

జయదేవ్ ఉనాద్కత్ – రాజస్థాన్ రాయల్స్ :

జయదేవ్ ధర 11. 5 కోట్లు.. ఈ సీజన్ లో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన బౌలర్. ఇదే డబ్బు పెడితే రాజస్థాన్ కు మరో ఇద్దరు మంచి ఆటగాళ్లు వచ్చేవారు. కానీ ఆశతో బెన్ స్టాక్ ని దక్కించుకున్నట్టుగానే జయదేవ్ ని కూడా దక్కించుకున్నారు. కానీ అతను మాత్రం గెలిపించాల్సిన సమయంలో పరుగులు ఇచ్చి ఆశలను ఆవిరి చేశాడు. గత సీజన్ లో పూణే తరపున ఆడి 12 మ్యాచ్ లలో 24 వికెట్లు తీసిన అతను ఈ సారి మాత్రం కేవలం 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

మ్యాక్స్ వెల్ – ఢిల్లీ డేర్ డెవిల్స్ :

ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. పూనకం వచ్చినట్టు గ్రౌండ్ లో బౌండరీలతో శివమెత్తే ఆటగాడు ఎవరంటే మ్యాక్స్ వెల్ అనేస్తారు. బంతి విసిరిదే తడువు గ్రౌండ్ అవతల బాల్ కనిపించాలి అనే విధంగా ఆడతాడు అని అంతా అనుకున్నారు. అందుకే ఢిల్లీ బౌలింగ్ లో కూడా ఉపయోగ పడతాడని పోటీ పడి మరి మ్యాక్స్ వెల్ ను 9 కోట్లకు కొనుక్కుంది. కానీ మ్యాక్స్ వెల్ ఊహించని విధంగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. కేవలం 169 పరుగులు చేసి ఆరు వికెట్లు మాత్రమే తీశాడు.

ఆరోన్ ఫించ్ – కింగ్స్ ఎలెవన్ పంజాబ్ :

కింగ్స్ ఎలెవన్ అదృష్టం ఏమిటో గాని ఏ ఆటగాన్ని తీసుకున్నా కూడా ట్రోపిని గెలుచుకునేనంత పోరాడలేకపోతోంది. అయితే పరిస్థితికి తగ్గటుగా నిలకడగా ఆడే ఆటగాడు అవసరమని ఈ సారి ఆరోన్ ఫించ్ ను 6.2 కోట్లకు దక్కించుకుంది. కానీ ఫించ్ మాత్రం ఏ విధంగానూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించలేదు. ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ఫించ్ పంజాబ్ జట్టుకు మాత్రం నిరాశే మిగిల్చాడు. తొలి రెండు మ్యాచ్ లలో డకౌట్ అయ్యాడు. మొత్తం ఈ సీజన్ లో ఫించ్ 134 పరుగులు మాత్రమే చేశాడు.