ఐపిఎల్ 2018 : పంజాబ్ పవర్ కి ఢీలా పడ్డ ఢిల్లీ !

Sunday, April 8th, 2018, 06:34:12 PM IST


నేడు మొహాలీలో ఢిల్లీ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఢీల్లీ నిర్దేశించిన 167పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. అయితే ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టులో కెప్టెన్‌ గౌతం గంభీర్‌ (55;42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా, రిషబ్‌ పంత్‌(28;13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌), క్రిస్‌ మోరిస్‌(27 నాటౌట్‌; 16 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌)లు మోస‍్తరుగా ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కోలిన్‌ మున్రో, గంభీర్‌లు ఆరంభించారు.

జట్టు 12 పరుగుల వద్ద ఉండగా మున్రో(4) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై శ్రేయస్‌ అయ్యర్‌(11), విజయ్‌ శంకర్‌(13)లు కూడా నిరాశపరిచారు. కాగా, గంభీర్‌ మాత్రం సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కాగా కేవలం 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ గంభీర్‌ మాత్రం నిలకడగా బ్యాటింగ్‌ చేసి అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. అయితే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ప్రధానంగా రాహుల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కింగ్స్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను ప్రేక్షకపాత్రకే పరిమితం చేసిన రాహుల్‌ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ముందుగా ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ 51 (16బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ ) వేగవంతమైన అర్ధశతకంతో చెలరేగి ఆడి పంజాబ్‌కు శుభారంభం అందించాడు.

ఆ తర్వాత యువరాజ్‌ సింగ్‌(12) నిరాశపరచగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కరుణ్‌ నాయర్‌ 50 (33బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ 24నాటౌట్‌ (23 బంతుల్లో; 1ఫోర్), మార్కస్‌ 22(15బంతుల్లో; 2 ఫోర్లు) బాధ్యతయుతంగా ఆడి జట్టును ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా ఢీల్లీ బౌలర్లలో బౌల్ట్‌, మోరిస్‌, క్రిస్టియన్‌, రాహుల్‌ తలో వికెట్‌ పడగొట్టారు…..