పవన్ ఏపీ పర్యటనకు సిద్దమవుతున్న స్పెషల్ బస్?

Tuesday, May 8th, 2018, 06:38:46 PM IST

2019 లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లి తమ గొంతుక వినిపించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్న విషయం తెలిసిందే. అంతే కాక ఆయన పాదయాత్ర మొదలెట్టాక పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం పెల్లుబికింది.

కాగా ఇదే విధంగా పవన్ కూడా త్వరలో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా 10 జిల్లాల్లోనూ దాదాపు 40 రోజులపాటు పర్యటించనున్నట్లు సమాచారం అందుతోంది. అంతే కాదు ఆయన ఈ పర్యటనలు జరిపే సమయంలో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఒక ప్రత్యేక బస్ ను కూడా ఒక ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నేతృత్వంలో సిద్ధం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బస్ లో చిన్నపాటి లివింగ్ రూమ్, కార్యకర్తలు ఎవరైనా సులభంగా వచ్చి మాట్లాడడానికి చిన్నపాటి క్యాబిన్, అలానే బస్ పైకి వెళ్ళటానికి లోపలినుండి చిన్న నిచ్చెన తదితరాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారట.

కాగా ఈ యాత్రలో జగన్ అధికార టీడీపీ వైఫల్యాలను, అలానే ప్రతిపక్ష పార్టీ లు ఇదివరకు చేసిన పాలన లోపాలను ప్రజలకు తెలియపరచే విధంగా యాత్ర సాగుతుందని సమాచారం. అయితే యాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది అనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదని, దానికి సంబందించిన అన్ని విషయాలు త్వరలోనే పార్టీ ఒక ప్రకటన రూపంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది……..

  •  
  •  
  •  
  •  

Comments