ఏ1, ఏ2 ముద్దాయిలా మమ్మల్ని ప్రశ్నించేది : నారా లోకేష్

Thursday, May 24th, 2018, 10:33:11 AM IST

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు ఏపీ పంచాయితీ, ఐటి శాఖామంత్రి నారా లోకేష్ నిన్న విజయవాడ కానూరులో సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన టిడిపి మహానాడులో పాల్గొన్నారు. గతసంవత్సరం విశాఖపట్నంలో ఏర్పాటుచేసిన మహానాడు కంటే ప్రస్తుతం మహానాడుకు ప్రజలనుండి మరింత స్పందన వస్తోందని అన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 60 అడుగుల ఎన్టీఆర్ కటౌట్ కి పూజలు చేసిన లోకేష్, అనంతరం ప్రసంగిస్తూ, హోదా కోసం చేసే ఈ పోరాటం ఆగదని, హోదా ఆంధ్రుల హక్కని అన్నారు. విభజన సమయంలో బిజెపి నాయకులు ఏపీకి ఇచ్చిన హామీలు పూర్తిగా గాలికివదిలేశారని, వాళ్లకు మద్దతుగా ఏపీలో రెండు పార్టీలు టీడీపీ పై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని అన్నారు.

హోదా సాధనకు అవసరమైతే దేశంలోని ఇతర ప్రాంతీయపార్టీల సహకారం కూడా తీసుకుంటామని, ఆ దిశగా చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలిపారు. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తుంటే, మరోవైపు పలుకేసుల్లో ఏ1, ఏ2 ముద్దాయిలైన జగన్, విజయసాయి రెడ్డిలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వారిద్దరూ తిరుమల శ్రీవారి పింక్ డైమండ్వి విషయమై మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. అయినా వారికి మాట్లాడే అర్హతలేదని, కేంద్రంలోని బిజెపితో అనైతిక పొత్తు పెట్టుకుని ఇక్కడ మా మీద విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని, అసలు వారికి సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు అని అన్నారు.

గతంలో తిరుమల జోలికి వచ్చిన వారి పరిస్థితి ఏమైందో ఒక్కసారి గుర్తుచేసుకోవాలని, అయినా గుడిని గుడిలో లింగాన్ని మింగే ప్రతిపక్ష నేత, ఆ పార్టీనేతలు ఏమి తెలుసునని ఆ వజ్రం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఒకప్పుడు రూ. 9 లక్షల రూపాయల ఆదాయపు పన్ను చెల్లించిన జగన్, తరువాత తండ్రి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక రూ.30 కోట్లు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని, అంతటి ఆదాయం తనకి ఎక్కడినుండి వచ్చిందో ప్రజల ముందుకివచ్చి తెలపాలని అన్నారు. హోదా కోసం కేంద్రాన్ని నిలదీసే దమ్ము ధైర్యం లేని వైసిపి నేతలు మా మీద కుట్రతో లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అయినా ప్రజలకు ఏమిజరుగుతుందో తెలుసునని, అవినీతి పార్టీలకు వారు ఎప్పటికీ మద్దతు ఇవ్వరని అన్నారు…….

  •  
  •  
  •  
  •  

Comments