అసెంబ్లీ సీట్లు పెరిగితే ఎవ‌రికి లాభం?

Thursday, September 27th, 2018, 10:00:37 AM IST

ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరిగే ఛాన్సుందా? ఒక‌వేళ పెరిగితే ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అంటే అందుకు స‌హేతుక‌మైన విశ్లేష‌ణ సాగాల్సి ఉందింకా. ఇదే విష‌య‌మై ఎన్నిక‌ల వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తాజాగా `పున‌ర్వ్య‌వ‌స్తీక‌ర‌ణ‌`పై కేంద్రం తీపి క‌బురు చెప్పేసింది. ఇది ఇరు తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌జ‌ల కంటే ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు, చంద్ర‌శేఖ‌ర్‌రావుల‌కు తీపి వార్త అని విశ్లేషిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన త‌రువాత ఇరు రాష్ట్ర‌ల్లో అసెంబ్లీ స్థానాల పెంపుకు సంబంధించిన చ‌ర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఏపీ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్లంలో భాగంగా అసెంబ్లీ స్థానాల పెంపు అనివార్య‌మ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు గ‌త కొన్నేళ్లుగా కేంద్రంతో చ‌ర్చ‌లు జ‌రుపుతూనే వున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఇది సాధ్యం కాద‌ని కేంద్రం ఈ అంశాన్ని వాయిదా వేస్తూ వ‌స్తోంది.

ఇన్నాళ్లూ వాయిదాకు కార‌ణ‌మైన‌ కేంద్రం తెలంగాణలో టీఆర్ఎస్ ముంద‌స్తు స‌మ‌రానికి సిద్ధ‌మైన వేళ మ‌రోసారి ఇదే పాయింట్‌ని తెర‌పైకి తీసుకురావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న‌ది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అసెంబ్లీ స్థానాల పెంపు ప్ర‌తిపాద‌న‌ను తాజాగా స్వీక‌రించింది. దీని కోసం ప్ర‌జా ప్ర‌తినిధుల చ‌ట్టంలో దీనికి కావాల్సిన స‌వ‌ర‌ణ‌లు చేసి పార్ల‌మెంట్ ఆమోదం పొందితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 50, తెలంగాణ 34 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవ‌కాశం వుంది. ఇది ఇద్ద‌రు చంద్రుల‌కు క‌లిసొస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు సంబంధించి సీట్ల పెంపున‌కు అడ్డుగా వున్న 170వ అధిక‌ర‌ణ‌ను అధిగ‌మించ‌డానికి ఇటీవ‌ల లోతుగా అధ్యాయ‌నం జ‌రిగింది. 170వ అధిక‌ర‌ణ‌లో వున్న మూడో స‌బ్ క్లాజుల‌కు అద‌నంగా మ‌రో దాన్ని చేర్చ‌డం ద్వారా దీన్ని సులువుగా అధిగ‌మించొచ్చ‌ని, ఈ సూత్రాన్నే భ‌విష్య‌త్తులో మిగ‌తా రాష్ట్రాల‌కు అవ‌లంబించొచ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే సీట్ల పెంపు అంశానికి సంబంధించిన ప్ర‌క్రియ పూర్తి కావాలంటే చాలా త‌తంగ‌మే వుంది. 2021లో జ‌నాభా గ‌ణ‌న పూర్తిచేసి దాని ప్ర‌కారం అంటే 2026లో అసెంబ్లీ స్థానాల పెంపు ప్ర‌క్రియ ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం వుంటుంది. అంటే 2019లోనే సీట్లు పెర‌గాలంటే 2011 జ‌న‌గ‌ణ‌న అనంత‌రం అటుపై 2026 వ‌ర‌కూ సీట్ల పెంపుకోసం వేచి చూడాల్సి ఉంటుందేమో? ఈ తతంగం కోసం వేచి చూడాల్సిన స‌న్నివేశం ఉంద‌న్న వాద‌నా ఉంది.