మోదీ అకౌంట్లో ఒకటి మరి బాబు అకౌంట్లో ఇంకెన్ని..?

Saturday, April 28th, 2018, 09:31:27 PM IST

ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ నమ్మకద్రోహానికి పాల్పడ్డాడంటూ.. చంద్రబాబునాయుడు తిరుపతి వేదికగా 30వ తేదీన నమ్మకద్రోహ సభ నిర్వహిస్తున్నారు. మంచిదే! నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పి.. అధికారం దక్కిన వెంటనే ఇష్టరాజ్యంగా చెలరేగుతున్నప్పుడు.. వారు పాల్పడిన నమ్మకద్రోహం గురించి ప్రజలకు తెలియజెప్పడం అవసరమే. ఎక్కడో ఒకచోట ఇలాంటి చెక్ పాయింట్ ఉంటే తప్ప నాయకులకు కూడా భయం ఉండదు. మోడీ పాల్పడిన నమ్మకద్రోహం గురించి ఎత్తిచూపుతున్నందుకు చంద్రబాబునాయుడును శెభాష్ అనాల్సిందే.

అయితే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని తిరుపతి సభ వేదికగా నాలుగేళ్ల కిందట ప్రకటించి.. ఆ మాట నిలబెట్టుకోలేకపోయినందుకు మోడీ నమ్మకద్రోహం పాల్పడినట్లుగా మనం ఇవాళ దెప్పిపొడుస్తున్నాం. ఆయన పార్టీని అడ్రస్ లేకుండా చేయాలని చంద్రబాబు హూంకరిస్తున్నారు.

మరి రాష్ట్ర అధినేతగా అదే సభ నుంచి హామీలు గుప్పించి చంద్రబాబునాయుడు చేసిన హామీల్లో ఆయన ఎన్ని నెరవేర్చారు. ఎన్నింటిని గంగలో కలిపారు…? వాటి గురించి ఎవరు ప్రశ్నించాలి? చంద్రబాబు పాల్పడిన నమ్మక ద్రోహాల ఖాతా సంఖ్య ఎంత? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సభలు నిర్వహిస్తే.. ఆయన చేసిన నమ్మకద్రోహాల గురించి ప్రజలకు క్లారిటీ వస్తుంది… అనే తరహా విమర్శలు ప్రజల్లో పుష్కలంగా వినిపిస్తున్నాయి.

పదేళ్లు అధికారానికి దూరంగా ఉండడాన్ని తట్టుకోలేక బాబు అనేక బూటకపు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారు. బాబు వస్తే జాబు వస్తుంది అనే మాయమాటల దగ్గరినుంచి నిరుద్యోగ భృతి వరకు రాజధాని- పోలవరం నుంచి కాపుల రిజర్వేషన్ వరకు.. ఆయన ఎన్నెన్ని విషయాల్లో మాటతప్పారో ప్రజలకు నమ్మకద్రోహం చేశారో లెక్కే లేదు. చంద్రబాబు నాయుడు మోడీ మీద రంకెలు వేస్తున్న తీరును గమనిస్తే… తాను పాల్పడిన నమ్మకద్రోహాల గురించి ఎవ్వరూ ప్రస్తావించకుండా మాట్లాడకముందే.. తాను ఎదుటి వారి మీద రాళ్లు రువ్వితే సరిపోతుందనే ధోరణిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments