సంచలన నిర్ణయం తీసుకున్న గద్దర్ : రానున్న ఎన్నికల్లో పోటీ?

Monday, July 16th, 2018, 10:05:54 AM IST

రానున్న 2019 ఎన్నికల వేళ, అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇకపోతే ఆయా పార్టీల్లో టిక్కెట్లను ఆశించే అభ్యర్థులు కూడా ఏ పార్టీలో తమకు సముచిత స్థానం దక్కి టికెట్ లభిస్తుంది అనే దానిపై తెలివిగా పావులు కదుపుతున్నారు. అయితే ఇటువంటి సమయంలో ఎవరి రాజకీయ నిర్ణయాలు ఎలాఉంటాయో చెప్పడం కష్టం. కొందరు రాజకీయ క్షేత్రం నుండి దూరమవుతుంటే, మరికొందరుఈ ఎన్నికల ద్వారా ఆ క్షేత్రంలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. కాగా తాను త్వరలోనే రాజకీయాల్లో చేరతానంటున్నారు ప్రజా గాయకులు గద్దర్. విప్లవగాయకుడు, రచయిత అయిన అయన గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిన్న వామపక్ష పార్టీలకు చెందిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన, రాజకీయాలు – ఎన్నికల సంస్కరణలు – ఆవశ్యకత అనే అంశంపై మాట్లాడిన అయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ఎందుకో రాజ్యాధికారం వైపు వెళ్ళాలి అనిపిస్తోందని,

అయితే తనకు మాత్రం ఇప్పటివరకు ఓటు హక్కు లేదని, త్వరలోనే ఓటు హక్కుకు నమోదు చేయించుకుంటానని అన్నారు. లాల్ నీల్ ఐక్యత కోసం దేశ ప్రజలందరూ చూస్తున్నారని, తనకు అందుకే రాజకీయాల్లోకి రావాలనిపిస్తోందని, అదే లాల్ నీల్ జెండాలతో సరికొత్త పార్లమెంట్ ను తీసుకురావాలని వుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ అందరికి సమన్యాయం, సమతుల్య రాజకీయం, అంబేద్కర్ విధానం పేరుతో మభ్యపెడుతోందేతప్ప ఏ మాత్రం వాటిని ఆచరణలో పెట్టడం లేదని, దేశ ప్రజలందరూ కూడా సమకాలీన ప్రభుత్వం వైపు చూస్తున్నారని అన్నారు. కాబట్టి లాల్ నీల్ ఐక్యతతోనే బహుజన రాజ్యాధికారం సాధించవచ్చని అభిప్రాయాన్ని అయన వెలిబుచ్చారు. ఇప్పటికే దేశ ప్రజలందరూ కూడా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీల నిరంకుశ విధానాలు, పాలనా పద్దతులను చూసి విసిగిపోయారని, ఇకనైనా ప్రజల స్వేచ్ఛ , సమానత్వం, సౌబ్రాత్రుత్వంతో కూడిన సమసమాజాన్ని ఏర్పాటు చేసే దిశగా అందరం అడుగులు వేద్దాం అని కోరారు….

  •  
  •  
  •  
  •  

Comments