ఆ నోట్లు అసలువా లేక దొంగ నోట్లా?

Wednesday, January 10th, 2018, 01:18:16 PM IST

భారతీయ రిజర్వ్ బ్యాంకు నూతనంగా ఈ మధ్యనే విడుదల చేసిన 50, 200 నోట్ల ముద్రణ తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అప్పుడే హాట్ హాట్ గా ముద్రించిన నోట్లని ఒక వ్యక్తి కట్టలు కట్టలుగా పేర్చడం ఈ వీడియో లో చూడవచ్చు. దొంగ నోట్లు చలామణి వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మన దేశ ఆర్ధిక వ్యవస్థకి ఒక పెద్ద ముప్పు. మన ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసేలా పాకిస్తాన్, బాంగ్లాదేశ్ వంటి దేశాల్లో దొంగ నోట్లను ముద్రించి ఇక్కడికి తరలిస్తున్నారు అనే ఒక వాదన బలంగా వుంది. నూతనంగా విడుదల చేసిన కొత్త నోట్లను కూడా అన్నివిధాలా గుర్తుపట్టలేని విధంగా అదే విధమైన రూపుతో దొంగనోట్లను బాంగ్లాదేశ్ లో తయారు చేస్తున్నారు అనేది ఈ వీడియో సారాంశం.

నటుడు మంచు విష్ణు ఈ వీడియో విషయమై ఒక ట్వీట్ కూడా చేశారు. ‘వావ్! ఇది నిజమా లేక అబద్దమా అని’ ఆయన ట్వీట్ ద్వారా అన్నారు. అయితే ఈ వీడియో లో వున్న నోట్లు అచ్ఛం అసలు నోట్లు లానే వున్నా, కొంత నిశితంగా పరిశీలించినట్లయితే భారతీయ రిజర్వు బ్యాంకు అని రాసి ఉండవలసిన చోట భారతీయ చిల్డ్రన్స్ బ్యాంకు అని రాసి వుంది. దీన్నిబట్టి ఇవి చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక ఫ్యాక్టరీ లో వీటిని ముద్రిస్తున్నారు అని కొందరి అభిప్రాయం. ఒక వేళ నిజంగా అవి చిన్న పిల్లలు ఆడుకునే నోట్లు అయితే అంత పెద్ద ఫ్యాక్టరీ లో ముద్రిస్తారా? కాదు కాదు అవి ఖచ్చితంగా దొంగనోట్లే అని మరి కొందరి వాదన. అయితే ఇది నిజంగానే బాంగ్లాదేశ్ లోని దొంగనోట్ల ముద్రణ కేంద్రమా లేక చిన్న పిల్లలు ఆడుకోవటానికి నోట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీనా అనేది ఇంకా తెలియవలసి వుంది. మొత్తానికి ఈ వీడియో తో నెటిజన్లు ఎవరికి నచ్చిన పంధా లో వారు మాట్లాడుకుంటున్నారు…