100 రోజుల పాలన హిట్టేనా..?

Tuesday, September 9th, 2014, 03:59:43 PM IST


29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. జూన్ 2న తెలంగాణ ఏర్పడిన రోజే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి సరిగ్గా 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై ఓ రివ్యూ.

పదమూడేళ్ల ప్రస్థానం.. ఎన్నో ఉద్యమాలు.. ఆందోళనలు.. అరెస్టులు.. నిరాహారదీక్షలు.. ఒడిదొడుకులు.. ఇలా సాగింది టీఆర్ఎస్ పార్టీ. చివరకు లక్ష్యం చేరింది.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు.. కొత్తరాష్ట్రంలో మొదటి ప్రభుత్వంగా కేసీఆర్ నాయకత్వంలో అధికారం చేపట్టింది. పాలన ఎలా ఉండబోతుంది..? ఉద్యమ పార్టీ నేతగా ఉన్న ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..? సమర్థవంతంగా పాలన సాగిస్తారా..? ఇలా అనేక అనుమానాలు.. అందరి దృష్టికి ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే నిశితంగా గమనించారు. దూకుడుగా నాలుగడుగు ముందుకు వేస్తే.. అవసరమైన చోట సంయమనం పాటిస్తూ ముందుకు సాగుతున్నారు కేసీఆర్.

విద్యుత్ పీపీఎ ల రద్దుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదం మొదలైంది.. గవర్నర్ కు హైదరాబాద్ పై ప్రత్యేక అధికారాలు లాంటి అనేక అంశాలపైనా ఏపీ.. కేంద్రంతోనే కయ్యానికి సై అన్నారు. ఉప్పు నిప్పుగా కొనసాగిన ఇరు రాష్ట్రాల సీఎంల వ్యవహారం సాగింది. రాష్ట్ర పతి పర్యటన తో సీఎం హోదాలతో తొలిసారి కలుసుకున్నారు కేసీఆర్.. చంద్రబాబు. ఆగస్టు 15 గవర్నర్ తేనేటీ విందు సందర్భంగా మారోసారి కలుసుకున్న సందర్భంగా… వివాద అంశాలకు తెరదించేందుకు ఇరువురి మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత రెండు రోజులకే ఇద్దరు సీఎంల బేటీ జరిగింది… బంగారు తెలంగాణ గా మారుస్తానంటున్న కేసీఆర్.. 100 డేస్ పాల‌న‌ను స‌క్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నారు.

గ‌త ప్రభుత్వాల పాల‌న‌లో విసిగిపోయిన తెలంగాణ ప్రజ‌లు.. నూత‌నంగా ఏర్పడ్డ స‌ర్కార్ పై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. వారి ఆశ‌ల‌ను వ‌మ్ము చేయ‌కుండా.. ఎన్నిక‌ల హామీల్లో ఇచ్చిన వాగ్ధానాల‌ను నిల‌బెట్టుకునేలా.. కేబినెట్ భేటీలో 43 అంశాల‌కు ప‌చ్చజెండా ఊపింది టీఎస్ స‌ర్కార్. వాటిలో ముఖ్యంగా బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమానికే పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. వ్యవ‌సాయ ఆధార నిరుపేద ద‌ళితులకు 3 ఎక‌రాల భూమి అనే ప‌ధ‌కాన్ని గోల్కొండ కోట‌లో నిర్వహించిన పంద్రాగ‌స్టు వేడుక‌ల్లో.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా ఎంపిక చేసిన.. ద‌ళిత కుటుంబంలోని మ‌హిళ పేరుమీద ప‌ట్టాల‌ను ప్రధానం చేశారు. అలానే.. తండాల‌ను పంచాయ‌తీలుగా గుర్తిస్తూ.. గిరిజ‌నుల మ‌న‌సులు దోచుకుంది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది స‌ర్కార్. దీంతో..తెలంగాణ ప్రభుత్వం అంటే బ‌డుగు, బల‌హీన వ‌ర్గాల ప‌క్షపాతి అని నిరూపించుకుంది.

విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రంలో నెల‌కొన్న క‌రెంట్ క‌ష్టాల‌ను అధిగ‌మించేందుకు త‌న ప్రయత్నాల‌ను ప్రభుత్వం ముమ్మరం చేసింది. క‌ర్ణాట‌క రాష్ట్రం నుంచి 1000 మెగా వాట్ల విద్యుత్ ను, ఛత్తీస్ గ‌డ్ రాష్ట్రం నుంచి మరో 2వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో నెల‌కొన్న విద్యుత్ సంక్షోభాన్ని తీర్చేందుకు…అందుబాటులో ఉన్న అన్ని వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకుని రైతుల‌కు 7 గంట‌ల విద్యుత్ ను స‌ర‌ఫరా చేసేందుకు చ‌ర్యల‌కు ఉప‌క్రమించింది. సింగ‌రేణి కాల‌రీస్ లోని కేంద్రం వాటాల‌ను కొనుగోలుచేసి.. సింగ‌రేణి ని మొత్తం తెలంగాణ ప‌రిధిలోకి తెచ్చేలా కార్యచ‌ర‌ణ‌ను రూపొందిస్తోంది. ఇటీవ‌లె రూర‌ల్ ఎల‌క్ట్రిఫికేష‌న్ కార్పోరేష‌న్ కూడా తెలంగాణ‌లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల‌కు 20వేల కోట్లు పెట్టుబ‌డి పెట్టేందుకు సుముఖ‌త వ్యక్తం చేసింది. వ‌చ్చే మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ స‌మ‌స్య‌ను అధిగ‌మించి…మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా ముందుకెళ్లోంది కార్యాచరణ రూపొందిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇవ్వని కొత్త పథకాలపైనా కసరత్తు చేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. నిరుపేద దళిత‌, గిరిజ‌న యువ‌తుల పెళ్లిళ్లకు 51 వేల ఆర్థిక సాయాన్ని సర్కార్ అందిస్తోంది. పేద మైనార్టీల యువ‌తుల‌కు కూడా 51 వేల సాయాన్ని అందించేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. హైద‌రాబాద్ లో మూత‌ప‌డిన క‌ల్లు దుకాణాలను పునరుద్ధరిస్తూ జీవో జారీ చేసింది.. గౌడ సొసైటీలకే నిర్వహన అప్పగిస్తూ గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని సర్కార్ భావిస్తోంది. ఆర్ బీ ఐ కాద‌న్నా.. ఎన్నికల హామీని నెరవేర్చేందుకు రైతులకు లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసింది.అర్హులైన ల‌బ్ధిదారుల‌కు మాత్రమే సంక్షేమ ప‌థ‌కాల‌ను వ‌ర్తింప‌జేయాల‌ని.. అన‌ర్హుల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా ల‌బ్ది చేకూర్చొద్దని నిర్ణయించుకున్నారు కేసీఆర్. అలానే మ‌హిళ భ‌ద్రత కై ఒక క‌మిటీని వేసి.. బాలిక‌ల‌కు, మ‌హిళ‌కు పూర్తి స్థాయిలో ర‌క్షణ క‌ల్పించేలా చ‌ట్టాల‌ను సైతం మార్చాల‌ని సూచించారు. పోలీసు సంక్షేమం దాదాపు 340 కోట్ల నిధుల‌ను సైతం విడుద‌ల చేశారు.

ప్రకృతి వైప‌రిత్యాల‌ వ‌ల్ల పంట‌ న‌ష్టపోయిన రైతుల‌ను ఆదుకునేందుకు 482 కోట్ల ఇన్ పుట్ స‌బ్సిడీని ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం చ‌ల్లగా ఉంటుంద‌ని.. రైతుల‌కోసం ఎన్ని నిధులు కేటాయించేందుకైనా ప్రభుత్వం సిద్ధమ‌ని చెబుతున్నారు. తాగునీటి ప్రాజెక్టు విష‌యంలో కూడా…ప్రత్యేక దృష్టి సారించారించి ముందుకు వెళ్తున్నారు సీఎం. కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్రమ‌బ‌ద్ధీక‌రించేందుకు నిర్ణయం తీసుకుని.. ఒప్పంద కార్మికులకు కల నెరవేర్చారు కేసీఆర్. త్వర‌లోనే టీఎస్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను నోటిఫికేష‌న్ జారీ చేస్తామని ప్రకటించారు. పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను చారిత్రక గోల్కొండ‌, ఫోర్ట్ వ‌రంగల్ వంటి ప్రదేశాల్లో నిర్వహించి ప్రత్యేకత చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై ఉన్న కేసుల‌న్నింటినీ ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు.

త‌న 100 రోజుల పాల‌న‌లో.. ప్రతి అంశంలో తెలంగాణ ప్రజ‌ల ఆకాంక్షల‌కు అనుగునంగానే త‌మ ప్రభుత్వ నిర్ణయాఉన్నాయని చెబుతున్నారు కేసీఆర్… అందులో భాగంగా ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వేలు.. మన ఊరు .. మన ప్రణాళిక లతో బడ్జెట్ కేటాయింపులకు సరికొత్త విధానానికి తెరదీశారు.. త్వరలోనే బడ్జెట్ సమావేశాలు ఉన్నందున.. ఈ నిర్ణయాలు ఏ మేరకు అమల్లోకి వస్తాయి.. ఏ శాఖకు ఎంత మేరకు న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే..