చిన్న‌మ్మ‌ను మోదీ న‌మ్మేస్తున్నారా?

Monday, February 11th, 2019, 11:37:43 AM IST

చిన్న‌మ్మ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని ప్ర‌ధాని మోదీ న‌మ్ముతున్నారా?. ఆమె రాజ‌కీయ ఎదుగుద‌ల బీజేపీలోనే అని ఆమెకు న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌న‌మే గుంటూరులో జ‌రిగిన స‌భ‌లో ఆమెకు స‌ముచిత స్థానం క‌ల్పించ‌డం అని చెబుతున్నారు. ద‌గ్గ‌బాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, పురందేశ్వ‌రి రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌ రాష్ట్ర ఆవిర్భావం త‌రువాత కాంగ్రెస్ ఉనికిని కోల్పోవ‌డంతో ఆ పార్టీ నుంచి త‌ప్పుకున్న పురందేశ్వ‌రి బీజేపీ పంచ‌న చేరారు. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు.

ఇటీవ‌ల త‌న త‌న‌యుడు హితేష్ చెంచురామ్‌తో క‌లిసి వైసీపీలోకి వెళ్ల‌డానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే తాము మాత్ర‌మే వైసీపీలోకి వెళుతున్నామ‌ని, పురందేశ్వ‌రి మాత్రం బీజేపీలోనే వుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు. అయితే ఈ ప‌రిణామం ఎక్క‌డ పురంధేశ్వ‌రిపై ప‌డుతుందో, బీజేపీ అధిష్టానం అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఆమెకు పార్టీలో ప్రాధాన్య‌త‌ను త‌గ్గిస్తుందో అనే ప్ర‌చారం జ‌రిగింది. దానికి చెక్ పెడుతూ గుంటూరులో జ‌రిగిన ప్ర‌ధాని మోదీ స‌భ‌లో పురందేశ్వ‌రికి బీజేపీ నాయ‌కులు స‌ముచిత స్థానాన్ని క‌ల్పించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. పురంధేశ్వ‌రి భ‌ర్త ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, హితేష్ చెంచురామ్ వైసీపీలో చేర‌డానికి సిద్ధ‌మ‌వుతున్నా పురంధేశ్వ‌రిని బీజేపీ మ‌హిళా మోర్చా జాతీయ అధ్య‌క్షురాలిగా, మ్యానిఫెస్టో క‌మిటీ క‌న్వీన‌ర్‌గా కొన‌సాగించ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. అయితే త‌న‌పై బీజేపీ అధిష్టానంతో పాటు ప్ర‌ధాని మోదీకి న‌మ్మ‌కం వుంది కాబ‌ట్టే అమెను కొన‌సాగిస్తున్నార‌ని, పార్టీలో స‌ముచిత‌మైన స్థానాన్ని ఇస్తున్నార‌ని తెలుస్తోంది.