మోడీపై జనసేనాని సరికొత్త వ్యూహం పని చేస్తుందా..?

Friday, March 15th, 2019, 04:23:34 PM IST

జనసేన పార్టీ ఆవిర్భవించి నిన్నటితో 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజమండ్రిలో భారీ ఎత్తున సభకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునివ్వగా అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలోనే జనం హాజరయ్యారు.ఈ సభలో పవన్ ఎలాంటి అంశాలను లేవనెత్తుతారో అని రాజకీయ శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.అందుకు తగ్గట్టు గానే పవన్ మోడీ నుంచి జగన్ వరకు ఎవ్వరిని వదిలకుండా గడిచిన 5 ఏళ్లలో వారు చేసిన తప్పులను లేవనెత్తారు.

అలాగే నరేంద్ర మోడీ అంటే తనకి ఎంత ఇష్టముందో చెప్తూనే రాష్ట్రానికి ఆయన చేసిన అన్యాయాన్ని ఎత్తి చూపి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన అన్యాయమే తనకి ఎంతో ఇష్టమైన వ్యక్తికి ఎదురు తిరిగేలా చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసారు.ఇక కేంద్రంలో ప్రభుత్వం మారితే తప్ప రాష్ట్రానికి న్యాయం జరగదని అనుకున్నారో ఏమో ఇప్పుడు మోడీపై కొత్త వ్యూహాలను రచిస్తున్నట్టు అనిపిస్తుంది.ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన “బహుజన పార్టీ” అధ్యక్షురాలు మాయావతిని తాను ప్రధాన మంత్రిగా చూడాలనుకుంటున్నాని షాకిచ్చారు.అందులో భాగంగానే పవన్ ఈ రోజు బీఎస్పీ శ్రేణులతో భేటీ కూడా అయ్యారు.

రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం వారు కేంద్రస్థాయిలో వీరితో పొత్తు పెట్టుకుంటున్నామని స్పష్టం చేసారు.అలాగే బహుజన పార్టీ అధ్యక్షురాలు మాయావతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో తమ పార్టీ మరియు జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నాయని,ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా జరిగిందని అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు.ఈ వృత్తాంతం అంతా చూస్తున్నట్టయితే పవన్ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయం వలనే మాయావతితో కలిసి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైనట్టు అనిపిస్తుంది.మరి మోడీపై పవన్ సిద్ధం చేస్తున్న వ్యూహం ఎంత వరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.