ప్రధాని పదవిని రాహుల్ త్యాగం చేస్తారా ?

Friday, May 17th, 2019, 03:15:19 PM IST

ప్రస్తుతం ప్రధాని అభ్యర్థులు ఎవరంటే బీజేపీ తరపున మోడీ, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ అని ఎవరైనా చెబుతారు. అంతలా నడుస్తోంది ఇద్దరి మధ్యా యుద్ధం. భాజాపాను ఒంటరిని చేయాలనే ఉద్దేశ్యంతో ప్రాంతీయ పార్టీలను కలుపుకునిపోతోంది కాంగ్రెస్. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టుకోగలిగింది. అలా మద్దతిస్తున్న లోక పార్టీల నుండి దశాబ్దాల రాజకీయ అనుభవం కొందరు సీనియర్ నేతలు ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

తమ కూటమి గెలిస్తే ప్రధాని పదవి తమకు ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ వద్దకు పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. ఈ సంగతి కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. గతంలో ప్రధాని రాహుల్ గాంధీయేనని ఊదరగొట్టినందు వలనే ఒళ్ళుమండిన చాలామంది లోకల్ లీడర్లు తమ మద్దతును కాంగ్రెస్ పార్టేకి ఇవ్వలేదు. ఆ ఉదంతం నుండి గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్ ఈసారి గెలుపు గురించి తప్ప ప్రధాని రాహుల్ గాంధీయేనని ఎక్కడ మాట్లాడట్లేదు. దీంతో ప్రాంతీయ పార్టీల మద్దతు సాధించగలిగింది.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల నుండి ఎవరినైనా ప్రధానిని చేయాలనే ప్రతిపాదన వస్తే తాము మద్దతిస్తామని, ప్రధాని పదవి పార్టీకి దక్కకపోయినా నష్టంలేదని కానీ కూటమి గెలవాలని అన్నారు. మరి ఆయన మాటల ప్రకారం నిజంగానే రాహుల్
గాంధీ ఈసారికి ప్రధాని పదవిని త్యాగం చేసి ఊరుకుంటారా అనేదే పెద్ద ప్రశ్న.