హోదా కోసం దీక్షకు ఆ నేత సిద్ధమవుతున్నారా?

Tuesday, February 13th, 2018, 08:15:21 PM IST

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం జరిగిందని రాష్ట్రంలోని పార్టీలన్నీ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘రాష్ట్రానికి న్యాయం చేయడం’ అనే నినాదాన్ని నమ్ముకుని ఆయన ముందుకు సాగనున్నారట. అయితే ఇప్పటికే ప్రత్యేక హోదా అనే స్ఫూర్తి ప్రజల్లో మంటగలిసిపోవడానికి తెలుగుదేశం పార్టీ చాలా చర్యలు చేపట్టిందని, వాస్తవానికి హోదా అయిపోయిన అంశంకాదని, ముందుగా ప్రజల్లో హోదా స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయాలని నిశ్ఛయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రత్యేకహోదాకు, ప్రత్యేక ప్యాకీజీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటో రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పి హోదా వస్తే ఏం జరుగుతుంది, దానికి ప్రత్యామ్నాయంగా ప్యాకేజీలో ఏం ఉంది, దానివల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరుగుతుందో ప్రజలకు తెలియ చెప్పాలని చూస్తున్నారు.

అసలు బాబు సర్కారు ప్రత్యేక ప్యాకేజీ కి దేనికి మొగ్గు చూపిందో కూడా ఆయన ప్రజలముందు
ఉంచాలని భావిస్తున్నారు. వేర్వేరు సందర్భాల్లో హోదా ప్రస్తావన తెచ్చినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఢిల్లీ సర్కారు ఇవ్వాల్సిన దాని గురించి ఢిల్లీలోనే దీక్ష చేయాలి తప్ప రాష్ట్రంలో కాదంటూ జగన్ ను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీతో పోలిస్తే ప్రస్తుతం తమ పార్టీకి సంఖ్యా బలం తక్కువైనప్పటికీ ఇప్పుడు జగన్ స్వయంగా ఢిల్లీలో దీక్ష ప్లాన్ చేస్తున్నారట. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో తమ పార్టీ ప్రజాప్రతినిధులతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడం ద్వారా ఆయన తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, తన గురించి, తన పార్టీ వైఖరి గురించి మాట్లాడే అధికార పార్టీ నేతల నోటికి వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పోరు కేవలం రాజకీయ పోరుగా కాకుండా ప్రజల పోరుగా నడిపించాలని, ఈ తన ప్రయత్నం సఫలమయ్యే అవకాశాల కోసం కొందరు రాజకీయ ప్రముఖుల సలహా కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది….